Tomato Kothimeera Pachadi : ట‌మాటా కొత్తిమీర ప‌చ్చ‌డిని ఇలా చేస్తే.. వ‌దిలి పెట్ట‌కుండా తింటారు..!

Tomato Kothimeera Pachadi : మ‌నం బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా త‌యారు చేసే దోశ‌, ఇడ్లీల‌ను తిన‌డానికి ర‌క‌ర‌కాల చ‌ట్నీల‌ను, ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అందులో అప్ప‌టిక‌ప్పుడు చేసే ట‌మాటా ప‌చ్చ‌డి ఒక‌టి. ఈ ప‌చ్చ‌డి ఎంతో రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిలో కొత్తిమీరను వేసి మ‌రింత రుచిగా త‌యారు చేయ‌వ‌చ్చు. ఇలా చేసిన ప‌చ్చ‌డితో కూడా దోశ‌, ఇడ్లీల‌ను తిన‌వ‌చ్చు. ఇక ట‌మాటా కొత్తిమీర ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి, దాని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Tomato Kothimeera Pachadi if you do it like this you will not leave it
Tomato Kothimeera Pachadi

ట‌మాటా కొత్తిమీర ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ట‌మాటా ముక్క‌లు – ముప్పావు క‌ప్పు, త‌రిగిన కొత్తిమీర – ఒక క‌ప్పు, ప‌ల్లీలు – 2 లేదా 3 టీ స్పూన్స్‌, ప‌చ్చి మిర్చి – 10, నూనె – ఒక టేబుల్ స్పూన్‌, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్‌, చింత‌పండు – 20 గ్రా., అల్లం ముక్క‌లు – ఒక టేబుల్ స్పూన్‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 6 లేదా 7, ఉప్పు – రుచికి స‌రిప‌డా.

తాళింపు చేయ‌డానికి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్‌, జీల‌క‌ర్ర – పావు టీ స్పూన్‌, ఎండు మిర్చి ముక్క‌లు – 2 లేదా 3, క‌రివేపాకు – ఒక రెబ్బ‌, ఇంగువ – పావు టీ స్పూన్‌.

ట‌మాటా కొత్తిమీర‌ ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో ప‌ల్లీల‌ను వేసి బాగా వేయించుకుని ప్లేటులోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే క‌ళాయిలో నూనె వేసి కాగాక ప‌చ్చి మిర్చిని వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక వీటిని కూడా ప్లేటులోకి తీసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో టమాటా ముక్క‌ల‌ను వేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల త‌రువాత త‌రిగిన కొత్తిమీర‌ను, చింత‌పండును వేసి బాగా క‌లిపి మూత పెట్టి మ‌రో 2 నిమిషాల పాటు ఉడికించుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా ఉడికే అవ‌స‌రం లేదు.

ఇలా ఉడికించుకున్న ట‌మాటాల‌ను పూర్తిగా చ‌ల్లారే వ‌ర‌కు ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో వేయించుకున్న ప‌ల్లీల‌ను, ప‌చ్చి మిర్చిని వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా ప‌లుకు ఉండేలా ప‌ట్టుకోవాలి. ఇలా ప‌ట్టుకున్న త‌రువాత ప‌క్క‌న‌ పెట్టుకున్న ట‌మాటా, కొత్తిమీర మిశ్ర‌మంతోపాటు అల్లం ముక్క‌లు, వెల్లుల్లి రెబ్బ‌లు, జీల‌క‌ర్ర‌, రుచికి స‌రిప‌డా ఉప్పును వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా ప‌ట్టుకోవాలి. ఇలా ప‌ట్టుకున్న దానిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె వేసి కాగాక తాళింపు ప‌దార్థాలు వేసి తాళింపు చేసుకోవాలి. ఇలా చేసుకున్న తాళింపును ముందుగా చేసి పెట్టుకున్న ప‌చ్చ‌డిలో వేసి క‌లుపుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే ట‌మాటా కొత్తిమీర ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. ఈ ప‌చ్చ‌డిని రోలులో వేసి కూడా మ‌నం చేసుకోవ‌చ్చు. దీంతో ఎంతో రుచిగా ఉంటుంది. ఇలా ఈ ట‌మాటా కొత్తిమీర ప‌చ్చ‌డిని త‌యారు చేసుకుని దీన్ని ఇడ్లీ, దోశ‌, ఉప్మా వంటి బ్రేక్ ఫాస్ట్‌ల‌తోపాటు అన్నం లేదా చ‌పాతీల‌తోనూ క‌లిపి తిన‌వ‌చ్చు. దీని వ‌ల్ల రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. రెండూ ల‌భిస్తాయి..!

Share
D

Recent Posts