Tomato Kurma Recipe : మనం వంటింట్లో విరివిరిగా ఉపయోగించే కూరగాయల్లో టమాటాలు ఒకటి. ఇవి మనందరికి తెలిసినవే. మన ఆరోగ్యాన్ని, చర్మాన్ని సంరక్షించడంలో టమాటాలు ఎంతగానో ఉపయోగపడతాయి. టమాటాలతో ఇతర కూరగాయలను కలిపి రకరకాల కూరలు, పచ్చళ్లు తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా కేవలం టమాటాలతో కూడా మనం కూరలను తయారు చేసుకోవచ్చు. టమాటాలతో చేసుకోదగిన వంటకాల్లో టమాట కుర్మా కూర కూడా ఒకటి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. టమాట కుర్మాను రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట కుర్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
పెద్ద ముక్కలుగా తరిగిన టమాటాలు – అర కిలో, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన ఉల్లిపాయ – 1, ఎండు కొబ్బరి ముక్కలు – రెండు టేబుల్ స్పూన్స్, జీడిపప్పు పలుకులు – 5, లవంగాలు – 3, యాలకులు – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పెరుగు – అర కప్పు, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూప్, గరం మసాలా – ఒక టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
టమాట కుర్మా తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. టమాట ముక్కలు ఉడికే లోపు జార్ లో ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, తగినన్ని నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలా మిశ్రమాన్ని టమాట ముక్కల్లో వేయాలి.
ఇందులోనే పెరుగు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలుపుకోవాలి. తరువాత దీనిపై మూతను ఉంచి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత ఒక గ్లాస్ నీటిని పోసి మరో 5 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాటో కుర్మా తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. పులావ్, బిర్యానీ వంటి వాటితో ఈ కూరను తినవచ్చు.