Tomato Kurma : చపాతీలు లేదా అన్నం.. ఎందులోకి అయినా స‌రే.. ఇలా చేస్తే.. ట‌మాటా కుర్మా భ‌లే రుచిగా ఉంటుంది..

Tomato Kurma : మ‌న‌కు అన్ని సీజ‌న్ల‌లోనూ అందుబాటులో ఉండే కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు ఒక‌టి. ట‌మాటాల‌ను మ‌నం నిత్యం వివిధ ర‌కాల కూర‌ల్లో వాడుతుంటాం. ట‌మాటా లేకుండా ఏ వంట‌క‌మూ పూర్తి కాదు. ట‌మాటాల‌తో నేరుగా కూడా కూర‌ల‌ను చేస్తుంటారు. ట‌మాటా ప‌ప్పు, ప‌చ్చడి చేసి తింటుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే ట‌మాటాల‌తో ఎంతో రుచిగా ఉండే కుర్మాను సైతం చేయ‌వ‌చ్చు. ఇది అన్నం లేదా చ‌పాతీల్లోకి ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని చేయ‌డం కూడా సుల‌భ‌మే. ట‌మాటా కుర్మాను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ట‌మాటా కుర్మా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ట‌మాటాలు – 1 క‌ప్పు (స‌న్న‌గా త‌ర‌గాలి), ఉల్లిపాయ‌లు – అర క‌ప్పు, దాల్చిన చెక్క – 3 చిన్న ముక్క‌లు, ల‌వంగాలు – 3, యాల‌కులు – 2, ఎండు కొబ్బ‌రి – అర క‌ప్పు, నూనె – 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు – పావు టేబుల్ స్పూన్‌, శ‌న‌గ‌లు – పావు టేబుల్ స్పూన్‌, జీల‌క‌ర్ర – అర టేబుల్ స్పూన్‌, పచ్చి మిర్చి – 6, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్‌, క‌రివేపాకులు – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు – అర టేబుల్ స్పూన్‌, ప‌సుపు – అర టేబుల్ స్పూన్‌, పెరుగు – 1 క‌ప్పు, కారం – ఒక‌టింపావు టేబుల్ స్పూన్‌, నీళ్లు – త‌గిన‌న్ని, ధ‌నియాల పొడి – 1 టేబుల్ స్పూన్‌, కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు.

Tomato Kurma recipe in telugu perfect to eat with rotis or rice
Tomato Kurma

ట‌మాటా కుర్మాను త‌యారు చేసే విధానం..

కుర్మా వంటి వంట‌కాల‌ను చేసేందుకు మ‌సాలా చాలా అవ‌సరం అవుతుంది. రుచిలో అదే ముఖ్యపాత్ర‌ను పోషిస్తుంది. క‌నుక ముందుగా మసాలా పొడిని సిద్ధం చేసుకోవాలి. అందుకు గాను ఒక పాన్ తీసుకుని అందులో ఎండు కొబ్బ‌రి, దాల్చిన చెక్క‌లు, యాల‌కులు, ల‌వంగాలు వేయాలి. వాటిని డ్రై రోస్ట్ చేసి ప‌క్కన పెట్టాలి. ఒక పాన్ తీసుకుని అందులో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. అనంత‌రం అందులో శ‌న‌గ‌లు, జీల‌క‌ర్ర‌, ఆవాల‌ను వేయాలి. ఆవాలు చిట‌ప‌ట‌లాడుతున్నప్పుడు ఉల్లిపాయ‌లు, ప‌చ్చి మిర్చి వేయాలి. ఉల్లిపాయ‌లు కాస్త వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క‌లిపి కాసేపు మ‌గ్గ‌నివ్వాలి. అనంతరం క‌రివేపాకులు, ప‌సుపు, ట‌మాటాలు వేయాలి. అన్నింటినీ బాగా క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టాలి. ఇప్పుడు 10 నిమిషాల పాటు అలాగే ఉడ‌క‌నివ్వాలి. దీంతో టమాటాలు సాఫ్ట్ గా మారుతాయి. త‌రువాత మూత తీసి క‌లిపి అందులో పెరుగు, నీళ్లు, కారం వేసి బాగా క‌లియ‌బెట్టాలి. త‌రువాత 1 నిమిషం పాటు స‌న్న‌ని మంట‌పై ఉడికించాలి.

ఇప్పుడు చ‌ల్ల‌గా అయిన మ‌సాలా దినుసుల‌ను ఒక మిక్సీలో వేసి అందులో కాస్త నీళ్లు పోసి మెత్త‌ని పేస్ట్‌లా ప‌ట్టుకోవాలి. ఈ పేస్ట్‌ను ట‌మాటా మిశ్ర‌మంలో వేసి బాగా క‌ల‌పాలి. అనంత‌రం స‌న్న‌ని మంట‌పై 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఈ స‌మ‌యంలో మూత పెట్టి ఉంచాలి. దీంతో మ‌సాలాల‌ను ట‌మాటాలు బాగా పీల్చుకుంటాయి. చివ‌ర‌గా ధ‌నియాల పొడిని వేసి బాగా క‌లియ‌బెట్టాలి. అయితే చ‌పాతీలు లేదా రోటీల్లోకి కూర చేస్తుంటే గ్రేవీ కోసం కొన్ని నీళ్ల‌ను క‌ల‌ప‌వ‌చ్చు. అన్నంలోకి అయితే అలాగే వ‌దిలేయాలి. త‌రువాత 2 నిమిషాల పాటు స‌న్న‌ని మంట‌పై ఉడికించి దింపేయాలి. దీంతో ఎంతో రుచిక‌ర‌మైన ట‌మాటా కుర్మా రెడీ అవుతుంది. దీన్ని అన్నం, చ‌పాతీలు లేదా రోటీల్లో తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. ఒక్క‌సారి టేస్ట్ చేస్తే.. మ‌ళ్లీ మ‌ళ్లీ కావాలంటారు.

Editor

Recent Posts