Tomato Perugu Pachadi : టమాటాలతో మనం రకరకాల వంటకాలను, పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాం. టమాటాలు మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించడంలో ఎంతో దోహదపడతాయి. టమాటాలతో చేసే ఎటువంటి కూరైనా, పచ్చడైనా చాలా రుచిగా ఉంటుంది. అందులో భాగంగా ఎంతో రుచిగా, సులవుగా చేసుకోగలిగే టమాట పెరుగు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట పెరుగు పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన టమాటాలు – పావు కిలో, పచ్చిమిర్చి – 10 లేదా తగినన్ని, పెరుగు – అర కప్పు, చింతపండు – ఒక చిన్న నిమ్మకాయంత, వెల్లుల్లి రెబ్బలు – 5, జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, కొత్తిమీర – కొద్దిగా, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, ఎండుమిర్చి – 2.
టమాట పెరుగు పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత టమాట ముక్కలు, తగినంత ఉప్పు, చింతపండు వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ టమాట ముక్కలు చల్లారిన తరువాత వాటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులోనే జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈపచ్చడిలో ఉండలు లేకుండా చిలికిన పెరుగును వేసి కలపాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసలు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత కరివేపాకు వేసి వేయించాలి.
ఇలా తయారు చేసుకున్న తాళింపును ముందుగా తయారు చేసుకున్న పచ్చడిలో వేసుకుని కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట పెరుగు పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నం, దోశ, ఉప్మా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. టమాటాలతో తరచూ చేసే పచ్చళ్లతో పాటు అప్పుడప్పుడూ ఇలా టమాట పెరుగు పచ్చడిని కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ టమాట పెరుగు పచ్చడిని విడిచి పెట్టకుండా అందరూ ఇష్టంగా తింటారు.