Tomato Pulao : మనం రకరకాల రైస్ వెరైటీలను తయారు చేస్తూ ఉంటాం. రైస్ వెరైటీలు రుచిగా ఉండడంతో పాటు చేయడానికి కూడా తేలికగా ఉంటాయి. ఈ విధంగా సులభంగా తయారు చేసుకోగలిగిన రైస్ వెరైటీలలో టమాట పులావ్ కూడా ఒకటి. ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. అలాగే బ్యాచిలర్స్, మొదటిసారి చేసేవారు ఇలా ఎవరైనా దీనిని తేలికగా తయారు చేసుకోవచ్చు.వంట ఏం చేయాలో తోచనప్పుడు ఇలా టమాట పులావ్ ను తయారు చేసుకుని తినవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా, సులభంగా టమాట పులావ్ ను ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టీ స్పూన్స్, నెయ్యి – 2 టీ స్పూన్స్, యాలకులు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 4, మరాఠీ మొగ్గ – 1, అనాస పువ్వు – 1, బిర్యానీ ఆకులు – చిన్నవి రెండు, సాజీరా – ఒక టీ స్పూన్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన క్యాప్సికం – 1, తరిగిన క్యారెట్ – 1, తరిగిన బంగాళాదుంప – 1, కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, తరిగిన టమాటాలు – 3, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – రెండు టేబుల్ స్పూన్స్, తరిగిన పుదీనా – రెండు టేబుల్ స్పూన్స్, నానబెట్టిన బియ్యం – 2 గ్లాసులు, నీళ్లు – 3 గ్లాసులు, పచ్చి బఠాణీ – ఒక టేబుల్ స్పూన్.
టమాట పులావ్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత కూరగాయ ముక్కలు, బఠాణీ వేసి వేయించాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఈ ముక్కలను మెత్తబడే వరకు వేయించిన తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. టమాట ముక్కలు మెత్తబడిన తరువాత ఉప్పు, కారం, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి. తరువాత బియ్యం వేసి కలపాలి.
ఇప్పుడు నీళ్లు పోసి కలపాలి. తరువాత దీనిని మధ్యస్థ మంటపై దగ్గర పడే వరకు ఉడికించాలి. తరువాత మంటను చిన్నగా చేసి మూత పెట్టి నీరంతా పోయి అన్నం పులావ్ పొడి పొడిగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని పది నిమిషాల తరువాత అంతా కలుపుకుని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి, నోటికి రుచిగా, స్పెషల్ గా తినాలనిపించినప్పుడు ఇలా టమాట పులావ్ ను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.