Curry Leaves Plant : మనం చేసే ప్రతి వంటలోనూ కరివేపాకును విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాము. కరివేపాకు చక్కటి వాసనను కలిగి ఉంటుంది. వంటల్లో కరివేపాకును వాడడం వల్ల వంటలు రుచిగా ఉండడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. కరివేపాకు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దీనిని ఉపయోగించడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. జుట్టు ఒత్తుగా పెరిగేలా చేయడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, బరువు తగ్గేలా చేయడంలో, శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో, షుగర్ ను అదుపులో ఉంచడంలో ఇలా అనేక రకాలుగా కరివేపాకు మనకు సహాయపడుతుంది.
చాలా మంది కరివేపాకు మొక్కను ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. కరివేపాకు మొక్క నేల మీద అలాగే కుండీల్లో కూడా సులభంగా పెరుగుతుంది. అయితే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి పురుగులు, కీటకాలు కరివేపాకు ఆకులను తినేస్తూ ఉంటాయి. అలా అని మనం పురుగు మందులను ఉపయోగించలేము. కొన్ని రకాల చిట్కాలను వాడడం వల్ల మనం చాలా సులభంగా కీటకాలు, పురుగులు కరివేపాకు మొక్క దరి చేరుకుండా చేయవచ్చు. అలాగే ఈ చిట్కాలను వాడడం వల్ల కరివేపాకు మొక్క ఏపుగా, గుబురుగా పెరుగుతుంది. ఈ చిట్కాలు పూర్తిగా సహజ సిద్దమైనవి. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం మజ్జిగను రెండు నుండి మూడు రోజుల పాటు పులియబెట్టాలి.
తరువాత మజ్జిగపై పేరుకున్న నీటిని అర లీటర్ మోతాదులో ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మరో అర లీటర్ సాధారణ నీటిని పోసి కలపాలి. తరువాత ఈ నీటిలో అర టీ స్పూన్ ఇంగువ, ఒక టీ స్పూన్ పసుపును వేసి కలపాలి. ఇప్పుడు ఈ నీటిని స్ప్రే బాటిల్ లో పోసుకుని కరివేపాకు మొక్క ఆకులపై స్ప్రే చేయాలి. ఇలా రెండు నుండి మూడు రోజులకొకసారి చేయడం వల్ల కరివేపాకు ఆకులను పురుగులు తినకుండా ఉంటాయి. కీటకాలు దరి చేరకుండా ఉంటాయి. అలాగే కరివేపాకు మొక్కకు బియ్యం కడిగిన నీటిని పోస్తూ ఉండాలి. అలాగే 15 లేదా నెలకొకసారి మొక్కకు ఒకటి లేదా రెండు గుప్పెళ్ల కంపోస్ట్ ఎరువును వేస్తూ ఉండాలి.
అలాగే 15 లేదా నెల రోజులకొకసారి ఒక టీ స్పూన్ ఎప్సం సాల్ట్ ను నీటిలో కలిపి వేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కరివేపాకు మొక్క గుబురుగా, ఏపుగా పెరుగుతుంది. మొక్కకు కావల్సిన పోషకాలన్నీ అందుతాయి. కరివేపాకు ఆకులు పెద్ద పెద్దగా చక్కటి రంగులో ఉంటాయి. ఈ విధంగా ఈ చిట్కాలను వాడడం వల్ల సహజసిద్దంగా కరివేపాకు మొక్కను ఏపుగా పెంచుకోవచ్చు అలాగే కీటకాలు, పురుగులు ఆకులను తినకుండా చేసుకోవచ్చు.