Usirikaya Thokku Pachadi : ఉసిరికాయ తొక్కు ప‌చ్చ‌డిని ఇలా పెట్టండి.. తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది..!

Usirikaya Thokku Pachadi : విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో ఉసిరికాయ‌లు కూడా ఒక‌టి. ఉసిరికాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి మెరుగుప‌డుతుంది. చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. వృద్దాప్య ఛాయ‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. ఉసిరికాయ‌లు మ‌న ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఉసిరికాయ‌ల‌తో ఎక్కువ‌గా మ‌నం ఎర్ర‌గా ఉండే ప‌చ్చ‌డిని త‌యారు చేస్తాము. అయితే ఈ ప‌చ్చ‌డి మాత్ర‌మే కాకుండా ఉసిరికాయ‌ల‌తో మ‌నం తొక్కు ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ప‌చ్చ‌డి కూడా సంవ‌త్స‌ర‌మంతా నిల్వ ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఉసిరికాయ‌ల‌తో సంవ‌త్స‌ర‌మంతా నిల్వ ఉండే తొక్కు ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉసిరికాయ తొక్కు ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉసిరికాయ‌లు – అర‌కిలో ( పెద్ద‌వి), ప‌చ్చిమిర్చి – 150 గ్రా., వెల్లుల్లి రెబ్బ‌లు – 50 గ్రా., రాళ్ల ఉప్పు – 100 గ్రా., ప‌సుపు – ఒక టీ స్పూన్.

Usirikaya Thokku Pachadi recipe in telugu make in this way
Usirikaya Thokku Pachadi

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ప‌సుపు – పావు టీ స్పూన్.

ఉసిరికాయ తొక్కు ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా ఉసిరికాయ‌ల‌ను శుభ్రంగా క‌డిగి త‌డి లేకుండా తుడుచుకోవాలి. త‌రువాత వీటిని ముక్క‌లుగా క‌ట్ చేసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత ప‌చ్చిమిర్చిని కూడా శుభ్రంగా క‌డిగి త‌డి లేకుండా తుడుచుకోవాలి. ఇప్పుడు ముందుగా రోట్లో ఉసిరికాయ ముక్క‌లు, ఉప్పు వేసి దంచుకోవాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి వేసి దంచుకోవాలి. చివ‌ర‌గా ప‌సుపు, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి దంచుకోవాలి. ఈ ముక్క‌ల‌ను మ‌రీ మెత్త‌గా కాకుండా క‌చ్చా ప‌చ్చాగా దంచుకుని గాజు సీసాలో లేదా జాడీలో లేదా ప్లాస్టిక్ డ‌బ్బాలో ఉంచి నిల్వ చేసుకోవాలి. అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఈ ప‌చ్చ‌డిని తీసి తాళింపు చేసుకోవాలి.

తాళింపు చేసుకోవ‌డానికి మ‌న‌కు కావ‌ల్సినంత‌ ప‌చ్చ‌డిని తీసుకుని జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత తాళింపు దినుసులు, క‌రివవేపాకు, ఎండుమిర్చి వేసి వేయించాలి. త‌రువాత ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న ప‌చ్చ‌డి వేసి క‌ల‌పాలి. దీనిని ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు 5 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఉసిరికాయ తొక్కు ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. ఈ ప‌చ్చ‌డిని అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ తింటారు.

Share
D

Recent Posts