Vankaya Pachi Karam Vepudu : మనం వంకాయలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. వంకాయలతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. వంకాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. వంకాయలతో చేసుకోదగిన కూరల్లో వంకాయ వేపుడు కూడా ఒకటి. చాలా మంది ఈ కూరను ఇష్టంగా తింటారు. ఈ వంకాయ వేపుడును మనం మరింత రుచిగా పచ్చికారం కూడా వేసి కూడా తయారు చేసుకోవచ్చు. పచ్చికారం వేసి చేసే ఈ వంకాయ వేపుడు ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని కూడా అందరూ ఇష్టంగా తింటారు. వంకాయ వేపుడును పచ్చికారం వేసి రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ పచ్చికారం వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్న ముక్కలుగా తరిగిన వంకాయలు – అర కిలో, పచ్చి కొబ్బరి ముక్కలు – 3 టేబుల్ స్పూన్స్, అల్లం – 2 ఇంచుల ముక్క, పచ్చిమిర్చి – 6 లేదా తగినన్ని , నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్.
వంకాయ పచ్చికారం వేపుడు తయారీ విధానం..
ముందుగా జార్ లో పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తాళింపు దినుసులు వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత వంకాయ ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి వంకాయ ముక్కలను మెత్తగా వేయించాలి. వంకాయ ముక్కలు వేగిన తరువాత మూత తీసి మరో 5 నిమిషాల పాటు వేయించాలి.
తరువాత పసుపు, వెల్లుల్లి రెబ్బలు, మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. దీనిని మరో మూడు నిమిషాల పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ పచ్చికారం వేపుడు తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఎండుకారం వేసి చేసే వంకాయ వేపుడు కంటే పచ్చికారం వేసి చేసే ఈ వంకాయ వేపుడు మరింత రుచిగా ఉంటుంది.