Ghee Making At Home : నెయ్యిగా ఎంత కమ్మగా ఉంటుందో మనందరికి తెలిసిందే. అన్నంతో కలిపి తినడంతో పాటు తీపి వంటకాల తయారీలో కూడా నెయ్యిని మనం ఉపయోగిస్తూ ఉంటాం. నెయ్యితో చేసిన వంటకాలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా ఉంటాయి. రుచితో పాటు నెయ్యి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. జీర్ణశక్తిని పెంచడంలో, నొప్పులను తగ్గించడంలో, ఎముకల సాంద్రతను పెంచడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో, రోగ నిరోధక శక్తిని అభివృద్ది చేయడంలో నెయ్యి మనకు ఎంతో ఉపయోగపడుతుంది. నెయ్యిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. గాయాలు త్వరగా మానుతాయి.
గర్భిణీ స్త్రీలు నెయ్యిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఇలా అనేక రకాలుగా నెయ్యి మనకు మేలు చేస్తుంది. ప్రస్తుత కాలంలో చాలా మంది బయట కొనుగోలు చేసిన నెయ్యినే వాడుతున్నారు. ఈ రోజుల్లో నెయ్యిని కూడా కల్తీ చేస్తున్నారు. కల్తీ నెయ్యిని వాడడం వల్ల ఆరోగ్యానికి మేలు కలగకపోగా అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది. కనుక ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యిని వాడడమే ఉత్తమం. నెయ్యిని ఇంట్లో తయారు చేసుకోవడం చాలా సులభం. చిక్కటి పాలు ఉండాలే కానీ నెయ్యిని మనం చాలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
ఇంట్లో సులభంగా నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజూ పాలను కాగబెట్టి కొద్దిగా పెరుగు వేసి తోడు వేయాలి. ఇలా చేయడం వల్ల పెరుగు తయారవుతుంది. ఈ పెరుగును కొద్ది సేపు ఫ్రిజ్ లో ఉంచడం వల్ల దానిపై మందంగా మీగడ వస్తుంది. ఈ మీగడను సేకరించి ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవాలి. ఇలా 10 రోజుల పాటు తయారు చేసుకున్న మీగడను మిక్సీ జార్ లో వేసుకోవాలి. అందులో తగినన్ని నీటిని పోసి మధ్య మధ్యలో ఆపుకుంటూ వెన్న వేరయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారైన వెన్నను ఒక గిన్నెలోకి తీసుకుని మూడు నుండి నాలుగు సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి. తరువాత దీనిని నీళ్లు లేకుండా వేరు గిన్నెలోకి తీసుకుని వేడి చేయాలి.
ఇందులో 4 లేదా 5 మెంతి గింజలు వేసి చిన్న మంటపై వేడి చేయాలి. వెన్న కరిగి లేత ఎరుపు రంగులోకి మారుతుంది. ఇలా రంగు మారగానే స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు ఉంచాలి. నెయ్యి చల్లారిన గాజు సీసాలో లేదా ప్లాస్టిక్ డబ్బాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఈ నెయ్యిని బయట లేదా ఫ్రిజ్ లో ఉంచి ఎలా అయిన నిల్వ చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల కమ్మటి వాసన, చక్కటి రుచి ఉండే నెయ్యి తయారవుతుంది. ఈ నెయ్యిని పిల్లలకు ఆహారంలో భాగంగా ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. బయట మార్కెట్ లభించే నెయ్యిని వాడడానికి బదులుగా ఇలా ఇంట్లోనే తయారు చేసుకున్న నెయ్యిని వాడడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.