Oats : ఓట్స్.. మనం ఆహారంగా తీసుకునే ధాన్యాల్లో ఇది ఒకటి. ఇతర ధాన్యాల వలె ఓట్స్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మనకు మార్కెట్ లో వివిధ రుచుల్లో ఈ ఓట్స్ లభిస్తూ ఉంటాయి. వీటిని పాలల్లో వేసి ఉడికించి తీసుకుంటారు. అలాగే వీటితో ఉప్మా, కిచిడి వంటి వాటిని తయారు చేస్తూ ఉంటారు. ఓట్స్ తో చేసే ఆహారాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఓట్స్ లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిలో కార్బోహైడ్రేట్స్, ఫైబర్, మోనో స్యాచురేటెడ్, పాలీ స్యాచురేటెడ్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, మాంగనీస్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఓట్స్ ను తీసుకోవడం వల్ల ఈ పోషకాలు మన శరీరానికి అందడంతో పాటు మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
ఓట్స్ వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓట్స్ గ్లూటెన్ రహిత ఆహారం. కనుక డయాబెటిస్ తో బాధపడే వారికి ఇది చక్కటి ఆహారమని చెప్పవచ్చు. ఓట్స్ ను తీసుకోవడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉండడంతో పాటు రాకుండా కూడా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు ఓట్స్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిని కొద్దిగా తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో మనం సులభంగా బరువు తగ్గవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య రాకుండా ఉంటుంది. రక్తనాళాలు వ్యాకోచించేలా చేసి రక్తపోటును అదుపులో ఉంచే శక్తి కూడా ఓట్స్ కు ఉంది. ఓట్స్ ను తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో మన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మన శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనే కాదు మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఓట్స్ మనకు దోహదపడతాయి. వివిధ రకాల సౌందర్య ఉత్పత్తుల్లో కూడా వీటిని విరివిరిగా ఉపయోగిస్తారు. అలాగే చర్మ సమస్యలను తగ్గించడంలో కూడా ఓట్స్ మనకు సహాయపడతాయి. ఓట్స్ ను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత శక్తి లభిస్తుంది. ఉదయాన్నే వీటిని అల్పాహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.