Vegetable Pocket Samosa : వెజిట‌బుల్ పాకెట్ స‌మోసా.. ఇలా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

Vegetable Pocket Samosa : వెజిటేబుల్ పాకెట్ స‌మోసా… ఈ స‌మోసాలు చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. క్రిస్పీగా ఉండే ఈ స‌మోసాల‌ను ఒక్క‌టి కూడా విడిచిపెట్ట‌కుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పిల్ల‌లు ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వచ్చు. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు ఇలా వేడి వేడిగా స‌మోసాల‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. క్రిస్పీగా, ఎంతో రుచిగా ఉండే ఈ పాకెట్ స‌మోసాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వెజిటేబుల్ పాకెట్ స‌మోసా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మైదాపిండి – ఒక‌టిన్న‌ర క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, వేడి నూనె – 2 టేబుల్ స్పూన్స్.

Vegetable Pocket Samosa recipe in telugu very tasty snacks
Vegetable Pocket Samosa

స్ట‌ఫింగ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి -2, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన క్యారెట్ – చిన్న‌ది ఒక‌టి, చిన్న‌గా త‌రిగిన బంగాళాదుంప – చిన్నది ఒక‌టి, చిన్న‌గా త‌రిగిన క్యాప్సికం – 1, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం- అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

వెజిటేబుల్ పాకెట్ స‌మోసా త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఉప్పు, వేడి నూనె వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని క‌లుపుకోవాలి. దీనిని చ‌పాతీ పిండిలా కలుపుకున్న త‌రువాత చిన్న చిన్న ఉండ‌లుగా చేసుకోవాలి. త‌రువాత ఒక్కో ఉండ‌ను తీసుకుంటూ పొడిపిండి చ‌ల్లుకుంటూ చ‌తుర‌స్రాకారంలో ప‌లుచ‌టి చ‌పాతీలా వ‌త్తుకోవాలి. దీనిని వీలైనంత ప‌లుచ‌గా వ‌త్తుకున్న త‌రువాత ఈ చ‌పాతీని వేడి వేడి పెనం మీద వేసి రెండు వైపులా అర నిమిషం పాటు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.

ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత ఒక్కో షీట్ ను తీసుకుంటూ స‌మానంగా ప‌ట్టీల ఆకారంలో క‌ట్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత‌ క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీవేఇస‌ల‌క‌ర్ర, ప‌చ్చిమిర్చి ముక్క‌లు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. వీటిని ప‌చ్చివాస‌న పోయే వ‌ర‌కు వేయించిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత క్యారెట్ ముక్క‌లు, క్యాప్సికం, బంగాళాదుంప ముక్క‌లు వేసి వేయించాలి. ముక్క‌లు మెత్త‌బ‌డే వ‌ర‌కు వేయించిన త‌రువాత ఉప్పు, ప‌సుపు, కారం, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా, మిరియాల పొడి వేసి క‌ల‌పాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

త‌రువాత ముందుగా త‌యారు చేసుకున్న షీట్ ల‌ను రెండింటిని తీసుకుని ప్ల‌స్ ఆకారంలో ఉంచాలి. త‌రువాత మ‌ధ్య‌లో స్ట‌పింగ్ ను ఉంచాలి. ఇప్పుడు ఒక్కో చివ‌ర‌ను మ‌ధ్య‌లోకి మ‌డుస్తూ వాటిపై మైదాపిండి పేస్ట్ ను రాయాలి. ఇలా పాకెట్ ఆకారంలో సమోసాను త‌యారు చేసుకున్న త‌రువాత ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక స‌మోసాల‌ను వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వెజిటేబుల్ పాకెట్ స‌మోసాలు త‌యార‌వుతాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts