Vegetable Rice : సాధారణంగా మనకు ఒక్కోసారి ఇంట్లో వంట చేసేందుకు అంత సమయం ఉండదు. అలాగే ఏం కూర చేయాలో కూడా కొందరికి అర్థం కాదు. అలాంటప్పుడు కింద చెప్పిన విధంగా వెజిటబుల్ రైస్‌ను తయారు చేసుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పైగా ఆరోగ్యకరమైనది కూడా. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లేదా మధ్యాహ్నం లంచ్‌లోకి బాగా సెట్ అవుతుంది. ఇక వెజిటబుల్ రైస్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వెజిటబుల్ రైస్ తయారీకి కావలసిన పదార్థాలు..
జీలకర్ర – అర టీస్పూన్, ఉల్లిగడ్డ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీస్పూన్, క్యారెట్ ముక్కలు – అర కప్పు, బీన్స్ ముక్కలు – అర కప్పు, పచ్చిబఠానీలు – అర కప్పు, గరంమసాలా – అర టీస్పూన్, ధనియాల పొడి – పావు టీస్పూన్, కారం – తగినంత, బియ్యం – 1 కప్పు, నీరు – రెండున్నర కప్పులు, కొత్తిమీర – తగినంత.
వెజిటబుల్ రైస్ ను తయారు చేసే విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేసి అందులో జీలకర్ర, పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి. ఇందులోనే పచ్చిబఠానీలు, క్యారెట్, బీన్స్ ముక్కలు వేసి కలపాలి. దీనికి గరంమసాలా, ధనియాల పొడి, కారం, తగినంత ఉప్పు వేసి కలపాలి. అరగంటపాటు నానబెట్టిన కప్పు బియ్యాన్ని మిశ్రమంలో కలిపి రెండున్నర కప్పుల నీటిని జోడించి, కట్ చేసిన కొత్తిమీర కలిపి మూతపెట్టాలి. పది నిమిషాలపాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. 5 నిమిషాల తర్వాత మూతతీయాలి. దీంతో ఘుమఘుమలాడే వెజిటబుల్ రైస్ రెడీ అయినట్లే. దీన్ని నేరుగా అలాగే తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.