Chicken Popcorn : చికెన్ తో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ తో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చికెన్ తో వంటకాలను తినడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. చికెన్ తో కూరలు, వేపుడు, బిర్యానీ వంటి వాటినే కాకుండా రకరకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. చికెన్ తో చేసుకోదగిన చిరుతిళ్లల్లో చికెన్ పాప్ కార్న్ కూడా ఒకటి. చికెన్ పాప్ కార్న్ లోపల మెత్తగా పైన కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. ఈ చికెన్ పాప్ కార్న్ ను తయారు చేయడం కూడా చాలా సులభం. రుచిగా, కరకరలాడుతూ ఉండేలా చికెన్ పాప్ కార్న్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ పాప్ కార్న్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బోన్ లెస్ చికెన్ – పావుకిలో, కోడిగుడ్డు – 1, చిల్లీ ఫ్లేక్స్ – ఒక టీ స్పూన్, ఒరగానో – పావు టీ స్పూన్, మిరియాల పొడి- అర టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ప్రైకు సరిపడా, సోయాసాస్ – అర టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, మైదాపిండి – 50 గ్రా., బ్రెడ్ క్రంబ్స్ – 50 గ్రా..
చికెన్ పాప్ కార్న్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో చికెన్ ను తీసుకోవాలి. తరువాత అందులో ఉప్పు, మిరియాల పొడి, సోయాసాస్, చిల్లీ ఫ్లేక్స్, ఒరగానో, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలపాలి. తరువాత ఈ చికెన్ ను పావు గంట పాటు కదిలించకుండా పక్కకు ఉంచాలి. ఇప్పుడు మరో ప్లేట్ లో మైదాపిండి, బ్రేడ్ క్రంబ్స్ వేసి కలపాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ను మైదాపిండి మిశ్రమంలో వేసి చికెన్ ముక్కలకు బాగా పట్టేలా కోట్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ముందుగా సిద్దం చేసుకున్న చికెన్ ముక్కలను నూనెలో వేసి వేయించాలి.
ఈ ముక్కలను కరకరలాడుతూ ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ పాప్ కార్న్ తయారవుతుంది. దీనిని టమాట కిచప్, మయోనీస్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. చికెన్ తో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా పాప్ కార్న్ ను తయారు చేసుకుని తినవచ్చు. ఈ చికెన్ పాప్ కార్న్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.