దేశంలో ఆదాయం పొందే ప్రతి ఒక్కరూ ఆదాయపు పన్ను కట్టాల్సి ఉంటుందన్న విషయం విదితమే. అయితే నిర్ణీత శ్లాబుల ప్రకారం ఆ పన్ను కట్టాల్సి ఉంటుంది. పన్ను పరిధిలోకి వచ్చేంత ఆదాయం లేకపోతే వారు పన్ను కట్టాల్సిన పనిలేదు. కానీ ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే భవిష్యత్తులో ప్రయోజనాలు కలుగుతాయి. ఇక ఆదాయపు పన్ను కట్టే వారు తాము కట్టే పన్నులోంచి మినహాయింపులు పొందేందుకు ఉపయోగపడేదే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సి. దీని వల్ల వ్యక్తులు కట్టే పన్నులో మినహాయింపులు పొందవచ్చు. డబ్బును ఆదా చేసుకోవచ్చు.
80సి సెక్షన్ కింద ఏడాదికి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు ఆదాయంలో పన్ను మినహాయింపు ఇస్తారు. దీనికి ఎన్‌పీఎస్ కలిపితే మరో రూ.50వేలు అంటే.. మొత్తం రూ.2 లక్షల ఆదాయానికి పన్ను మినహాయింపు పొందవచ్చు.
ఉదాహరణ చెప్పాలంటే.. ఒక వ్యక్తి ఏడాదికి రూ.10 లక్షలు వేతనం పొందితే బడ్జెట్ ప్రకారం స్టాండర్డ్ డిడక్షన్ రూ.50వేలు వర్తిస్తుంది. అంటే రూ.9.50 లక్షలకు పన్ను చెల్లించాలి. ఆ మొత్తం రూ.1,06,600 అవుతుంది. అదే ఇందులో ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సి ని ఉపయోగించుకుంటే రూ.2 లక్షల మేర ఆదాయానికి పన్ను మినహాయింపు పొందవచ్చు. దీంతో కట్టే పన్ను రూ.65వేలకు తగ్గుతుంది. ఈ క్రమంలో రూ.46,600 ఆదా అవుతాయి.
ఇక సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపులు పొందేందుకు పలు మార్గాల్లో డబ్బును పొదుపు చేసుకోవచ్చు. అందుకు ఈఎల్‌ఎస్‌ఎస్ మ్యుచువల్ ఫండ్స్, భవిష్యనిధి (ఈపీఎఫ్, పీపీఎఫ్), జీవిత బీమా, పెన్షన్ పథకం (ఎన్‌పీఎస్), ఎఫ్‌డీ, సుకన్య సమృద్ధి యోజన, ఎస్‌సీఎస్‌ఎస్ (వయోవృద్ధ పొదుపు పథకం), ఎన్‌ఎస్‌సీ (జాతీయ పొదుపు సర్టిఫికెట్) వంటివి ఉపయోగపడతాయి.
అలాగే పిల్లలకు స్కూల్ ఫీజులు, గృహ రుణాలు కట్టేవారు వాటిపై కూడా సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపులు పొందవచ్చు. వీటిని ఐటీ రిటర్న్స్‌లో చూపించాలి. తద్వారా పన్ను మినహాయింపులు లభిస్తాయి. అలాగే ఇన్‌ఫ్రా బాండ్స్, నాబార్డ్ గ్రామీణ బాండ్స్, యూలిప్, రిటైర్మెంట్ బీమా పథకాల ద్వారా కూడా సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపులు పొందవచ్చు. దీంతో డబ్బును ఆదా చేయడమేకాక, భవిష్యత్తు కోసం డబ్బు పొదుపు అవుతుంది.