Wheat Flour Punugulu : మనం సులభంగా తయారు చేసుకునే స్నాక్ ఐటమ్స్ లో పునుగులు కూడా ఒకటి. పునుగులు చాలారుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం చాలా సులభం. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. సాధారణంగా పునుగులను మైదాపిండితో తయారు చేస్తూ ఉంటారు. మైదాపిండితో చేసే పునుగులు రుచిగా ఉన్నప్పటికి వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కేవలం మైదాపిండే కాకుండా మనం గోధుమపిండితో కూడా రుచికరమైన పునుగులను తయారు చేసుకోవచ్చు. గోధుమపిండితో చేసే ఈ పునుగులు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా తేలిక. స్పాక్స్ గా లేదా అల్పాహారంగా కూడా వీటిని తీసుకోవచ్చు. గోధుమపిండితో రుచికరమైన పునుగులను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమపిండి పునుగుల తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – ఒకటిన్నర కప్పు, పుల్లటి పెరుగు – ఒక కప్పు, ఉప్పు – తగినంత, జీలకర్ర -అర టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – -2, తరిగిన కరివేపాకు -ఒక రెమ్మ, వంటసోడా – పావు టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
గోధుమపిండి పునుగుల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, జీలకర్ర, పెరుగు వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా బోండా పిండి లాగా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 3 నుండి 4 గంటల పాటు పిండిని పులియబెట్టాలి. అంతసమయం లేని వారు కనీసం ఒకగంట పాటైన పిండిని నానబెట్టాలి. పిండి చక్కగా పులిసిన తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు, వంటసోడా వేసి కలపాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని పునుగుల్లా వేసుకోవాలి. తరువాత వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమపిండి పునుగులు తయారవుతాయి. వీటిని వేడి వేడిగా చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా ఇలా పునుగులను తయారు చేసుకుని తింటూ వర్షాన్ని ఎంజాయ్ చేయవచ్చు.