Black Thread : కాళ్ల‌కు న‌ల్ల‌దారాన్ని ఎందుకు క‌ట్టుకుంటారు.. దీని వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Black Thread : మ‌నం కాళ్ల‌కు న‌ల్ల దారాల‌ను క‌ట్టుకునే వారిని చాలా మందిని చూసే ఉంటాం. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ కాళ్ల‌కు న‌ల్ల దారాన్ని క‌ట్టుకుంటుంటారు. ఇలా న‌ల్ల దారం క‌ట్టుకోవ‌డం ఒక ఫ్యాష‌న్ గా కూడా త‌యారైంది. మ‌న‌కు వివిధ ర‌కాల డిజైన్ ల‌లో ఉండే న‌ల్ల దారాలు కూడా మార్కెట్ లో దొరుకుతున్నాయి. అస‌లు కాళ్ల‌కు న‌ల్ల దారాన్ని ఎందుకు క‌ట్టుకుంటారు.. అనే సందేహం మ‌న‌లో చాలా మందికి వ‌చ్చే ఉంటుంది. కాళ్ల‌కు న‌ల్ల దారం క‌ట్టుకోవ‌డం వెనుక ఉన్న అర్థం ఏమిటి.. ఈ న‌ల్ల దారాన్ని క‌ట్టుకోవ‌డం వ‌ల్ల క‌లిగే మేలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌నం న‌ర దిష్టి, న‌ర ఘోష అనే ప‌దాల‌ను వినే ఉంటాం. న‌ర దిష్టికి న‌ల్ల రాయి కూడా ప‌గులుతుంది అనే సామెత ఉండ‌నే ఉంది. మ‌న‌కు ఈ న‌ర దిష్టి, న‌ర ఘోష త‌గ‌ల‌కుండా ఉండ‌డానికి కాళ్ల‌కు న‌ల్ల దారాన్ని, న‌ల్ల తాడును క‌డ‌తారు. ఇలా క‌ట్ట‌డం వ‌ల్ల నెగెటివ్ ఎన‌ర్జీ కూడా మ‌న నుండి దూరంగా ఉంటుందట‌. మ‌న పూర్వీకులు ఎక్కువ‌గా పిల్ల‌ల‌కు న‌ల్ల దారాన్ని క‌ట్టేవారు. దీనినే క్ర‌మంగా పెద్దలు కూడా క‌ట్టుకోవ‌డం అల‌వాటు చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల‌లో స్త్రీల‌కు పెళ్లి అయిన వెంట‌నే కాళ్ల‌కు న‌ల్ల‌దారాన్ని క‌ట్ట‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

why some people tie Black Thread to legs
Black Thread

ఈ న‌ల్ల దారాన్ని క‌ట్టేట‌ప్పుడు తొమ్మిది ముడుల‌ను వేసే ఆచారం, అలాగే దిష్టి దోషం పోయేలా మంత్రాల‌ను చ‌దువుతూ న‌ల్ల‌దారాన్ని క‌ట్టే ఆచారం కొన్ని ప్రాంతాల‌లో ఇప్ప‌టికీ ఉంది. అలాగే ఈ న‌ల్ల దారాన్ని ఎప్పుడు ప‌డితే అప్పుడు క‌ట్ట‌రు. ఉద‌యం బ్ర‌హ్మ ముహుర్తంలో మాత్ర‌మే దీనిని కడ‌తారు. అలాగే తాడును స‌రి సంఖ్య‌లో ఉండే విధంగా అన‌గా రెండు చుట్లూ, నాలుగు లేదా ఆరు చుట్లూ ఉండే విధంగా క‌డుతూ ఉంటారు. కొంద‌రు చేతుల‌కు కూడా న‌ల్ల దారాన్ని క‌డ‌తారు. కానీ కొన్ని ప్రాంతాల‌లో చేతుల‌కు ఇత‌ర దారాలు ఉంటే మాత్రం న‌ల్ల దారాన్ని క‌ట్ట‌రు. అలాగే శ‌నివారం లేదా మంగ‌ళ‌వారం మాత్ర‌మే దీనిని క‌ట్టుకోవాలి అనే ఆచారం కూడా ఉంది.

కేవ‌లం న‌ర దిష్టి త‌గ‌ల‌కుండా ఉండ‌డానికి మాత్ర‌మే కాకుండా కాళ్ల‌కు న‌ల్ల దారం క‌ట్టుకోవ‌డం వెనుక మ‌రో అర్థం కూడా ఉంది. పూర్వ‌కాలంలో ఎక్కువ‌గా వ్య‌వ‌సాయం చేసేవారు. అడ‌వులు కూడా ఎక్కువ‌గా ఉండేవి. ఇప్పుడు ఉన్న‌ట్టుగా పూర్వ‌కాలంలో రోడ్డు స‌దుపాయం లేదు. అడ‌వుల మ‌ధ్యలో నుండే ఎక్కువ‌గా ప్రయాణాలు చేసేవారు. అలాగే పూర్వ‌కాలంలో విష జీవులు కూడా ఎక్కువ‌గా ఉండేవి. ప‌నులు చేసుకునేట‌ప్పుడు, ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు విష జీవులు కాటు వేసే అవ‌కాశం కూడా ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక ముందే కాళ్ల‌కు దారాల‌ను క‌ట్టుకునే వార‌ట‌. విష జీవులు కాటు వేసిన వెంట‌నే విషం శ‌రీర‌మంతా వ్యాపించ‌కుండా ప్ర‌థ‌మ చికిత్స లాగా ప‌నికి వ‌స్తాయ‌ని ఏదో ఒక దారాన్ని క‌ట్టుకునేవార‌ట‌. ఆ అల‌వాటే క్ర‌మ‌క్ర‌మంగా న‌ల్లదారం క‌ట్టుకునే అల‌వాటుగా మారింద‌ని మ‌రి కొంద‌రు చెబుతున్నారు. అయితే న‌ల్ల దారాన్ని ఎక్కువగా దిష్టి త‌గ‌ల‌కుండా ఉంటుంద‌నే చాలా మంది ప్ర‌స్తుతం క‌ట్టుకుంటున్నారు.

Share
D

Recent Posts