Lemon : నిమ్మకాయ.. దీనిని చూడని వారుండరు. నిమ్మకాయను ఉపయోగించడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికీ తెలుసు. భారతీయ సాంప్రదాయంలో నిమ్మకాయలకు ఎంతో ప్రాధాన్యత ఉందనే చెప్పవచ్చు. వివిధ రకాల పూజలల్లో కూడా నిమ్మకాయలను ఉపయోగిస్తారు. పూర్వకాలంలో ఇంటికి ఎవరైనా అలసిపోయి వస్తే నిమ్మకాయ రసం కలిపిన నీటిని ఇచ్చే వారు. ఈ నీటిని తాగడం వల్ల తక్షణ శక్తి లభించేది. అంతేకాకుండా నిమ్మకాయలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
తరచూ నిమ్మకాయ రసాన్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల పలు రకాల క్యాన్సర్ ల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య పరంగా, ఆధ్యాత్మికంగానూ నిమ్మకాయలకు ఎంతో విశిష్టత ఉంది. ఎటువంటి చెడు ఫ్రభావాన్నయినా సరే క్షణాలలో దూరం చేసే శక్తి నిమ్మకాయకు ఉంటుంది. తరచూ పీడకలలు వచ్చేవారు పూజించిన నిమ్మకాయను దిండు కింద పెట్టుకుని పడుకుంటే పీడ కలలు రావు. అష్టమి కలసి వచ్చే శుక్రవారం నాడు చేతిలో నిమ్మకాయను పట్టుకుని ఏదైనా కోరుకుంటే అది తప్పక నెరవేరుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
మనం కోరుకున్న కోరికలను తీర్చే శక్తి కూడా నిమ్మకాయకు ఉంటుందట. అమ్మవారి గుడికి వెళ్లినప్పుడు అమ్మవారి దగ్గర ఉంచి పూజించిన నిమ్మకాయను ఇంటికి తీసుకువచ్చి ఆ నిమ్మకాయ నుండి తీసిన రసాన్ని కుటుంబం అంతా తాగితే ఆ కుటుంబానికి మంచి జరుగుతుందట. ఇలా పూజించిన నిమ్మకాయను వ్యాపారం చేసే వారు అందరికీ కనబడేలా వారు వ్యాపారం చేసే చోట ఒక గ్లాస్ నీటిలో వేసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల దిష్టి తలగకుండా ఉంటుంది. అదే విధంగా ఇలా పూజించిన నిమ్మకాయను ఇంటి గుమ్మానికి కట్టినా కూడా నర దిష్టి తగలకుండా ఉంటుంది. ఇలా కట్టడం వల్ల దుష్ట శక్తులు మన దరి చేరకుండా ఉంటాయి.
నిమ్మకాయలను కోసి రసాన్ని పిండి ఆ తొక్కలను పడేయకుండా వాటిని వెనుకకు తిప్పి వాటితో రాహుకాలంలో అమ్మవారి గుడిలో దీపాలను వెలిగించాలి. ఇలా దీపాలను వెలిగించడం వల్ల మన ఇంట్లో ఉండే సమస్యలన్నీ తీరుతాయి. మహాలక్ష్మీ అమ్మవారి గుడిలో ఎప్పుడూ కూడా నిమ్మకాయలల్లో దీపాలను వెలిగించకూడదు. అలాగే ఇంట్లో కూడా వెలిగించకూడదు. ఈ విధంగా నిమ్మకాయలను ఉపయోగించి మనం ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.