Mosquitoes : కాలంతో సంబంధం లేకుండా ప్రతి కాలంలోనూ మనల్ని ఇబ్బంది పెట్టే సమస్యల్లో దోమలు ఒకటి. సాయంత్రం సమయాల్లో వీటి ఉధృత్తి మరీ ఎక్కువగా ఉంటుంది. దోమ కాటు కారణంగా మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి విష జ్వరాల బారిన పడాల్సి వస్తుంది. దోమకాటు ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారుతుంది. చాలా మంది దోమలను నివారించడానికి మస్కిటో కాయిల్స్, రిఫిల్స్, స్ప్రేలను వాడుతూ ఉంటారు. వీటి తయారీలో రసాయనాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటిని అధికంగా వాడడం వల్ల జలుబు, ఆయాసం, ఉబ్బసం వంటి శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఎటువంటి రసాయనాలు వాడడకుండా దోమల సమస్య నుండి బయటపడేసే ఒక మంచి చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దోమలను నివారించడంలో వెల్లుల్లి రెబ్బలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. దీని కోసం ముందుగా 4 వెల్లుల్లి రెబ్బలను తీసుకుని మెత్తని పేస్ట్ లా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో 4 కర్పూరం బిళ్లలను పొడిగా చేసి వేసుకోవాలి. చివరగా ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యిని వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక ప్రమిదలో వేసుకోవాలి. తరువాత దీనిపై ఒక వత్తిని ఉంచి సాయంత్రం చీకటి పడుతున్న సమయంలో ఇంటి తలుపులన్నీ మూసేసి వెలిగించాలి. ఇలా తయారు చేసుకున్న దీపం 20 నుండి 25 నిమిషాల పాటు చక్కగా వెలుగుతుంది. ఈ దీపం నుండి వచ్చే పొగ కారణంగా గదిలో ఉండే దోమలు బయటకు వెళ్లిపోవడం జరుగుతుంది.
సాయంత్రం సమయంలో దీనిని ఒక్కసారి వెలిగిస్తే రాత్రంతా కూడా సహజ సిద్దమైన కీటక నాశినిగా పని చేస్తుంది. అంతేకాకుండా ఇలా వెలిగించిన దీపం మనకు ఎయిర్ ఫ్యూరీ ఫైయర్ గా కూడా పని చేస్తుంది. దీనిని వాడడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు కూడా తగ్గు ముఖం పడతాయి. ఈ చిట్కాను పాటించడంతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి తలుపులకు, కిటికీలకు తెరలను అమర్చుకోవాలి. రాత్రి పూట దోమ తెరలను ఉపయోగించాలి. అలాగే పెరట్లో దోమలు ఎక్కువగా ఉన్న చోట కాఫీ గింజలను పొడిగా చేసి చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా దోమల సమస్య తగ్గుతుంది. ఈ విధంగా ఈ చిట్కాను పాటించడం వల్ల మనం దోమకాటుకు గురి కాకుండా ఉండవచ్చు.