Aloe Vera : సాధారణంగా చాలా మంది రకరకాల మొక్కలను ఇంట్లో పెంచుకుంటుంటారు. అయితే అవసరం లేని అలంకరణ మొక్కల కన్నా మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించే ఔషధ మొక్కలను ఇంట్లో పెంచుకోవాలి. దీంతో మనకు ఎలాంటి వ్యాధి వచ్చినా సరే ఆ ఔషధ మొక్కలు అందుబాటులో ఉంటాయి కనుక వెంటనే అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. ఇక ఇళ్లలో పెంచుకోదగిన ఔషధ మొక్కల్లో కలబంద ఒకటి. దీన్ని ఇంట్లో మనం పెంచుకోవడం చాలా సులభమే. నీళ్లు కూడా చాలా తక్కువగా అవసరం అవుతాయి. సులభంగా పెరుగుతుంది. దీని వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి.
కలబందను ఇంట్లో పెంచుకోవడం వల్ల వాటి ఆకుల్లో ఉండే గుజ్జు మనకు ఎప్పటికప్పుడు సహజసిద్ధంగా లభిస్తుంది. మార్కెట్‌లో మనకు కలబంద రసం లభిస్తుంది. కానీ అందులో రసాయనాలు కలిపి నిల్వ చేస్తారు. కనుక అలాంటి కలబంద రసం మనకు మంచిది కాదు. కాబట్టి ఇంట్లోనే మనం కలబంద మొక్కలను పెంచుకోవడం వల్ల ఎప్పటికప్పుడు సహజసిద్ధమైన గుజ్జు లభిస్తుంది. అందులో కాస్త నీళ్లు పోసి రసంలా తయారు చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే పది రోజుల వరకు తాజాగా ఉంటుంది. దీన్ని మనకు కావల్సినప్పుడు వాడుకోవచ్చు. ఇలా కలబంద మొక్కలను ఇంట్లోనే పెంచుకోవడం వల్ల మనకు ఎంతో ఉపయోగం ఉంటుంది. పైగా చాలా తక్కువ ఖర్చుకే కలబంద రసం లభిస్తుంది.
ఇక కలబంద రసాన్ని 30 ఎంఎల్ మోతాదులో ఉదయాన్నే పరగడుపునే రోజూ తాగవచ్చు. దీంతో జీర్ణవ్యవస్థ మొత్తం శుభ్రమవుతుంది. మలబద్దకం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. అల్సర్ పుండ్లు నయమవుతాయి. అధిక బరువు తగ్గుతారు. చర్మానికి కలబంద గుజ్జు ఎంతగానో పనిచేస్తుంది. దీన్ని కాస్త రాస్తే అన్ని రకాల చర్మ సమస్యలు తగ్గుతాయి. అలాగే చర్మం కాంతివంతంగా మారుతుంది. మొటిమలు, మచ్చలు, కళ్ల కింద నల్లని వలయాలు పోతాయి. ఈ విధంగా కలబంద మొక్కలను ఇంట్లో పెంచుతూ వాటి నుంచి వచ్చే గుజ్జు, దాంతో తయారు చేసే రసంతో మనం అనేక లాభాలను పొందవచ్చు.