గెనుసు గడ్డ (స్వీట్ పొటాటో) దీన్నే చిలగడ దుంప అని కూడా అంటారు. ఈ గడ్డల్లో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి. తెలుపు, పసుపు రంగు గడ్డలు ఉంటాయి. వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. 100 గ్రాముల ఉడకబెట్టిన చిలగడదుంపలను తింటే 86 క్యాలరీల శక్తి లభిస్తుంది. అలాగే కార్బొహైడ్రేట్లు 20 గ్రాములు, చక్కెర 4.2 గ్రాములు, ఫైబర్ 3 గ్రాములు, ప్రోటీన్లు 1.6 గ్రాములు లభిస్తాయి. కొవ్వు 0.1 గ్రాముల మోతాదులో లభిస్తుంది.
ఒక ఉడకబెట్టిన చిలగడదుంపను తింటే రోజుకు మనకు కావల్సిన విటమిన్ ఎలో దాదాపుగా 236 శాతం లభిస్తుంది. కనుక విటమిన్ ఎ కు ఈ దుంపలను నెలవుగా చెప్పవచ్చు. విటమిన్ ఎ మనకు ఏ విధంగా ప్రయోజనాలను అందిస్తుందో అందరికీ తెలిసిందే. ఇది కంటి చూపును మెరుగు పరిచి కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుదలకు కూడా దోహదం చేస్తుంది.
చిలగడదుంపల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. షుగర్ లెవల్స్ నియంత్రణకు పనిచేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు ఈ దుంపలను తింటే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. సాధారణంగా దుంపలు అంటే షుగర్‌ను పెంచుతాయని అనుకుంటారు. కానీ చిలగడదుంపలు అందుకు పూర్తిగా వ్యతిరేకం. ఈ దుంపలు ఇతర దుంపల్లా కాదు, వీటిని తింటే షుగర్ పెరగదు, తగ్గుతుంది. అందువల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అలాగే బరువు తగ్గాలని చూసేవారు కూడా రోజూ ఈ దుంపలను తినవచ్చు. అయితే కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు మాత్రం ఈ దుంపలను తినకూడదు.