Cherries : చెర్రీ పండ్లు.. చూసేందుకు ఎరుపు రంగులో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే ఇవి రుచిలోనూ అద్భుతంగానే ఉంటాయి. చెర్రీ పండ్లను తినేందుకు చాలా మంది ఎంతో ఆసక్తిని చూపిస్తుంటారు. చెర్రీ పండ్లను చాలా మంది తీపి వంటకాల తయారీలో వాడుతారు. స్వీట్ పాన్ లోనూ చెర్రీ పండ్లను పెట్టి ఇస్తారు. అయితే వాస్తవానికి చెర్రీ పండ్లను తినడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. చెర్రీ పండ్లను రోజూ తింటే మనం అనేక లాభాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చెర్రీ పండ్లలో ఆంథో సయనిన్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. అందువల్ల చెర్రీ పండ్లను తింటే శరీరంలోని నొప్పులు, వాపులు తగ్గుతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. చెర్రీ పండ్లను తినడం వల్ల కీళ్లు, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇక ఈ పండ్లను తింటే మన శరీరంలో రాత్రిపూట మెలటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఫలితంగా ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గుతాయి. దీంతో రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. దీంతో నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.
చెర్రీ పండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. చెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కండరాల నొప్పులను తగ్గిస్తాయి. కండరాలు బాగా నొప్పులు ఉన్నవారు చెర్రీ పండ్లను తింటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. అలాగే ఈ పండ్లను తినడం వల్ల శరీరంలోని యూరిక్ యాసిడ్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. దీంతోపాటు రక్తం కూడా ఎక్కువగా తయారవుతుంది. దీంతో రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఇలా చెర్రీ పండ్లను రోజూ తినడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు.