Alubukhara Fruit : మనకు కాలానుగుణంగా లభించే పండ్లల్లో ఆల్ బుకరా పండ్లు కూడా ఒకటి. దీనినే ఇండియన్ ప్లమ్ అని కూడా అంటారు. ఈ పండ్లు మనకు వర్షాకాలంలో ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. ఈ పండ్లు పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది ఈ పండ్లను ఇష్టంగా తింటారు. రుచితో పాటు ఈ పండ్లను తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో వీటిని తప్పకుండా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. వర్షాకాలంలో ఈ ఆల్ బుకరా పండ్లను ఖచ్చితంగా ఎందుకు తీసుకోవాలి.. వీటి వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆల్ బుకరా పండ్లల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. 100గ్రాముల ఆల్ బుకరా పండ్లల్లో 87 గ్రాముల నీటిశాతం ఉంటుంది. 11 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 44 క్యాలరీల శక్తి , ఒకటిన్నర గ్రాముల పీచు పదార్థాలు ఉన్నాయి. ఈ పండ్లల్లో తక్కువ శక్తి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వర్షాకాలంలో ఈ పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. వర్షాకాలంలో చాలా మంది జబ్బుల బారిన పడుతూ ఉంటారు. ఈ పండ్లను తీసుకోవడం వల్ల వాతావరణ మార్పుల కారణంగా వచ్చే అంటువ్యాధులు, జబ్బులు మన దరి చేరకుండా ఉంటాయి.
జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఈ ఆల్ బుకరా పండ్లను తీసుకోవడం వల్ల నోటికి రుచిగా ఉండడంతో పాటు జ్వరం నుండి త్వరగా కోలుకుంటారు. అలాగే ఈ పండ్లను తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. ఎముకలకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడే వారు రోజూ రెండు పూటలా ఈ పండ్లను 3 నుండి 4 చొప్పున మూడు నెలల పాటు తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడి సమస్యలు తగ్గుతాయని నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేసారు. ఆల్ బుకరా పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
జీర్ణకోశం యొక్క కదలికలు పెరుగుతాయి. మలబద్దకం సమస్య తగ్గుతుంది. అలాగే ఈ పండ్లను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఈ పండ్లల్లో నీటిశాతం ఎక్కువగా శక్తి తక్కువగా ఉంటుంది కనుక షుగర్ వ్యాధితో బాధపడే వారు ఈ పండ్లను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బరువు తగ్గడంలో కూడా ఈ పండ్లు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ విధంగా ఆల్ బుకరా పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వర్షాకాలంలో వీటిని తీసుకోవడం వల్ల మరింత మేలు కలుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.