Methi Dosa : మన వంటింట్లో ఉండే దినుసుల్లో మెంతులు కూడా ఒకటి. మెంతులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. షుగర్ ను అదుపులో ఉంచడంలో, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, బీపిని అదుపులో ఉంచడంలో, బాలింతలల్లో పాల ఉత్పత్తిని పెంచడంలో ఇలా అనేక రకాలుగా మెంతులు మనకు సహాయపడతాయి. వంటల్లో వాడడంతో పాటు ఈ మెంతులతో మనం ఎంతో రుచిగా ఉండే దోశలను కూడా తయారు చేసుకోవచ్చు. బ్రౌన్ రైస్, మెంతులు కలిపి చేసే ఈ దోశలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ మెంతుల దోశలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతుల దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
బ్రౌన్ రైస్ – ఒక కప్పు, మెంతులు – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మెంతుల దోశ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో బ్రౌన్ రైస్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో మెంతులు వేసి శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 7 నుండి 8 గంటల పాటు నానబెట్టాలి. తరువాత వీటిని జార్ లో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత పిండిని గిన్నెలోకి తీసుకుని మూత పెట్టి రాత్రంతా పులియబెట్టాలి. పిండి పులిసిన తరువాత ఇందులో ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. తరువాత స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక పిండిని తీసుకుని దోశలాగా వేసుకోవాలి. తరువాత దీనిపై ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర చల్లుకోవాలి. తరువాత నూనె వేసి ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మెంతుల దోశ తయారవుతుంది. దీనిని ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మెంతులతో దోశను తయారు చేసుకుని తినడం వల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందవచ్చు.