Palm Fruit : తాటి పండ్లు.. ఇవి మనందరికి తెలిసినవే. వీటిని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. తాటి ముంజలు, తాటి కల్లుతో పాటు తాటి పండ్లను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. తాటి చెట్లను ప్రకృతి మానవులకు ప్రసాదించిన వరం లాగా చెప్పవచ్చు. తాటి పండు గుజ్జులో ఎన్నో పోషకాలు ఉంటాయి. దీనిని తినడం వల్ల మనం ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. దీనిలో ఐరన్, క్యాల్షియం, పొటాషియం, జింక్, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్స్ కూడా తాటి పండులో పుష్కలంగా ఉంటాయి. తాటి పండు చాలా మధురంగా ఉంటుంది. తాటి పండును కొన్ని ప్రాంతాల్లో చీకుడు తాటి కాయ అని కూడా పిలుస్తారు.
కానీ నేటి తరుణంలో తాటి పండును తింటారని కూడా మనలో చాలా మందికి తెలియదు. దీనిని పోషకాల గని కూడా పిలుస్తారు. తాటి పండు పిల్లల ఎదుగుదలలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. తాటి పండు నుండి గుజ్జును తీస్తున్న కొద్ది వస్తూ ఉంటుంది. కొందరు ఈ తాటి పండును నేరుగా నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ ఉంటారు. కొందరు స్పూన్ తో లేదా దానిని తురుము కొని తాటి గుజ్జును తీసుకుని తింటూ ఉంటారు. ఈ గుజ్జుతో తాటి తాండ్రను కూడా తయారు చేస్తూ ఉంటారు. తాటి తాండ్రను సంవత్సరమంతా నిల్వ చేసుకుని తింటూ ఉంటారు. తాటి తాండ్రను తినడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారు దీనిని తినడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు సైతం చెబుతున్నారు.
అలాగే పూర్వకాలంలో బెల్లానికి బదులుగా తాటి పండు గుజ్జునే ఎక్కువగా ఉపయోగించే వారు. దీనితో కుడుములు కూడా వండుకుని తినే వారు. తాటి పండును తినడం వల్ల శరీరానికి కావల్సిన శక్తి, బలం లభిస్తుంది. నేటి తరుణంలో కొందరు ఈ గుజ్జుతో స్వీట్ లను, కేక్ లను కూడా తయారు చేస్తున్నారు. అంతేకాకుండా తాటి పండును తినడం వల్ల శరీరంలో రోగ నిరోదక శక్తి పెరుగుతుంది. తరచూ ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. అంతేకాకుండా దీనిలో ఉండే క్యాల్షియం ఎముకలను ధృడంగా, బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ పండును ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య తగ్గు ముఖం పడుతుంది. ఈ పండ్లను తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. ఈ పండ్లు దొరికే కాలంలో వీటిని పిల్లలకు తినిపించడం చాలా అవసరం. ఈ విధంగా తాటి పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.