Trifle Pudding : మనకు రెస్టారెంట్ లలో, బేకరీలలో, స్వీట్ షాపుల్లో రకరకాల పుడ్డింగ్స్ లభిస్తూ ఉంటాయి. పుడ్డింగ్ లను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. వాటిలో ట్రెఫెల్ పుడ్డింగ్ కూడా ఒకటి. ఈ పుడ్డింగ్ చాలా రుచిగా ఉంటుంది. చల్ల చల్లగా తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది ఈ పుడ్డింగ్. ఈ ట్రైఫెల్ పుడ్డింగ్ ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. స్పెషల్ డేస్ లో, ఇంట్లో పార్టీ ఉన్నప్పుడు ఈ పుడ్డింగ్ ను తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ట్రెఫెల్ పుడ్డింగ్ ను ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ట్రైఫెల్ పుడ్డింగ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – 300 ఎమ్ ఎల్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, పంచదార – ఒకటిన్నర కప్పు, చిక్కటి పాలు – 300ఎమ్ ఎల్, ఫ్రెష్ క్రీమ్ – 200 ఎమ్ ఎల్, కస్టర్డ్ పౌడర్ – 3 టేబుల్ స్పూన్స్, స్పాంజ్ కేక్ – 300 గ్రాములు, చిన్నగా తరిగిన అరటి పండు – 1, బొప్పాయి ముక్కలు – అర కప్పు, విప్పింగ్ క్రీమ్ – కొద్దిగా.
ట్రైఫెల్ పుడ్డింగ్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నీళ్లు పోసుకోవాలి. ఇందులోనే దాల్చిన చెక్క, పంచదార వేసి కలపాలి. పంచదార కరిగే వరకు దీనిని వేడి చేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో పాలు, క్రీమ్ వేసి బాగా కలపాలి. తరువాత దీనిని స్టవ్ మీద ఉంచి ఒక పొంగు వచ్చే వరకు వేడి చేయాలి. తరువాత కస్టర్డ్ పౌడర్ ను నీటిలో వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాలలో వేసి కలపాలి. దీనిని మధ్యస్థ మంటపై ఉండలు లేకుండా కలుపుతూ ఉడికించాలి. ఈ మిశ్రమం క్రీమీగా అయ్యి దగ్గర పడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కేక్ ను చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని అందులో కేక్ క్యూబ్స్ ను వేసుకోవాలి. వీటిని ముందుగా తయారు చేసుకున్న పంచదార మిశ్రమంతో తడుపుకోవాలి. తరువాత మనకు నచ్చిన ఫ్రూట్ ముక్కలను, డ్రై ఫ్రూట్ లను వేసుకోవాలి. తరువాత దీనిపై ముందుగా తయారు చేసుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని వేసుకోవాలి. దీనిని లేయర్ గా స్ప్రెడ్ చేసుకున్న తరువాత మరలా కేక్ క్యూబ్స్ ను వేసుకోవాలి. వీటిని కూడా షుగర్ సిరప్ తో తడుపుకోవాలి. తరువాత మరికొన్ని ఫ్రూట్ ముక్కలను, డ్రై ప్రూట్స్ ను వేసుకోవాలి. తరువాత దీనిపై మరలా కస్టర్డ్ ను వేసుకోవాలి. తరువాత మరలా కేక్ క్యూబ్స్ ను వేసుకుని షుగర్ సిరప్ తో తడుపుకోవాలి. మరలా ఫ్రూట్ ముక్కలను, డ్రై ఫ్రూట్స్ ను వేసుకుని దానిపై మిగిలిన కస్టర్డ్ మిశ్రమాన్ని వేసుకోవాలి.
ఇప్పుడు దీనిపై విప్పింగ్ క్రీమ్ తో గార్నిష్ చేసుకోవాలి. తరువాత మనకు నచ్చిన ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పుడ్డింగ్ ను రెండు గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ట్రైఫెల్ పుడ్డింగ్ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. వేసవికాలంలో అప్పుడప్పుడూ ఇలా చల్లటి పుడ్డింగ్ ను తయారు చేసుకుని తినవచ్చు.