Water Apple : మార్కెట్‌లో మనకు అప్పుడప్పుడూ అనేక రకాల పండ్లు కనిపిస్తుంటాయి. అయితే చాలా వరకు పండ్లు మనకు తెలిసినవే అయి ఉంటాయి. కానీ కొన్ని పండ్ల గురించి మాత్రం ఇప్పటికీ ఇంకా అనేక మందికి తెలియదు. కొన్ని పండ్లు మనకు బయట కనిపిస్తుంటాయి. కానీ అవేమిటో.. అనుకుంటుంటాం. వాటి గురించి పట్టించుకోం. కానీ అలాంటి పండ్లను కూడా విడిచిపెట్టవద్దు. ఎందుకంటే ప్రతి పండులోనూ పోషకాలు ఉన్నట్లే వాటిల్లో కూడా ఉంటాయి. కనుక బయట మనకు లభించే కొత్త రకాల పండ్లను వేటినీ విడిచిపెట్టొద్దు. తప్పక కొని తెచ్చుకుని తినాలి. ఇక అలా మనకు బయట కనిపించే పండ్లలో రోజ్ యాపిల్స్ కూడా ఒకటి. వీటినే వాటర్ యాపిల్స్ అని కూడా అంటారు. ఇవి మనకు బయట అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. అయితే వీటి ప్రయోజనాల గురించి తెలిస్తే మాత్రం ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. వీటితో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజ్ యాపిల్స్ ఎక్కువగా మలేషియా, ఇండోనేషియా వంటి దేశాల్లో పండుతాయి. అయితే దీన్ని మన దేశంలోనూ ప్రస్తుతం కొన్ని చోట్ల పండిస్తున్నారు. అందువల్ల ఈ పండ్లు మనకు కూడా లభిస్తున్నాయి. ఇవి చూసేందుకు పింక్ రంగులో ఎంతో ఆకర్షణీయంగా యాపిల్స్ మాదిరిగా ఉంటాయి. పైగా టేస్ట్ కూడా ఇంచు మించు అలాగే ఉంటాయి. కనుకనే వీటిని రోజ్ యాపిల్స్ అంటారు. ఇక వీటిల్లో నీరు ఎక్కువగా ఉంటుంది. కనుక వాటర్ యాపిల్ అని కూడా అంటారు. వీటిని కొన్ని ప్రాంతాల్లో జమైకా యాపిల్, మైనపు జంబు, బెల్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ పండ్లను తినడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
వాటర్ యాపిల్స్ బాగా పండితే తీపిగా ఉంటాయి. కానీ అక్కడక్కడా చేదులా అనిపిస్తుంది. ఇక ఈ పండ్లు మనకు ఎన్నో లాభాలను అందిస్తాయి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. బాక్టీరియా, వైరస్ సంబంధ వ్యాధులు తగ్గుతాయి. ఈ పండ్లలో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. దీని వల్ల గ్యాస్, అజీర్ణం, మలబద్దకం వంటివి ఉండవు. అలాగే శరీరంలోని కొవ్వు కూడా కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఈ పండ్లను తింటే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. దీంతో డయాబెటిస్ నియంత్రణలోకి వస్తుంది. అలాగే ఈ పండ్లలో ఉండే విటమిన్ సి చర్మాన్ని సంరక్షిస్తుంది. చర్మం మృదువుగా, తేమగా మారుతుంది. పొడిబారకుండా ఉంటుంది.
ఈ పండ్లలో ఉండే విటమిన్ సి దంతాలు, చిగుళ్లను దృఢంగా, ఆరోగ్యంగా మారుస్తుంది. చిగుళ్ల నుంచి రక్తం కారే సమస్య తగ్గుతుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇక ఈ పండ్లను తినడం వల్ల పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కనుక మీకు ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఈ పండ్లు కనిపిస్తే విడిచిపెట్టకండి. వెంటనే కొని తెచ్చి తినండి. దీంతో పైన తెలిపిన ప్రయోజనాలను పొందవచ్చు.