Dates : తీపి పదార్థాల తయారీలో మనం పంచదారకు బదులుగా ఉపయోగించుకోగలిగే వాటిల్లో ఖర్జూర పండ్లు కూడా ఒకటి. ఇవి మనందరికీ తెలుసు. ఖర్జూర పండ్లు ఎంతో తియ్యని రుచిని కలిగి ఉంటాయి. ఎండిన ఖర్జూరాలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మనకు మార్కెట్ లో వివిధ రకాల ఖర్జూరాలు లభిస్తాయి. వీటిని తినడం వల్ల మనం రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఖర్జూర పండ్లు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఖర్జూర పండ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీనిని సంస్కృతంలో ఖజ్జూ, రాజ్ ఖర్జూరి, పిండ ఖర్జూరి అని హిందీలో సులేమానీ, చోక్రా అని పిలుస్తారు. ఇవి వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటాయి.
ఖర్జూర పండ్లు చాలా ఆలస్యంగా జీర్ణమవుతాయి. పైత్యం, మొలలు, దాహం, కఫం, ఉబ్బసం, వాతం, జ్వరం, అతిసారం, దగ్గు వంటి వాటిని నయం చేయడంలో ఖర్జూర పండ్లు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. గుండెను, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఖర్జూర పండ్లు సహాయపడతాయి. ఖర్జూర పండును నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ ఉంటే వెక్కిళ్లు తగ్గిపోతాయి. ఎండు ఖర్జూరం లోపల ఉండే గింజను తీసేసి ఆ ఖర్జూరంలో ఎర్ర గుగ్గిలాన్ని నింపి దానిని గోధుమపిండితో మూసేసి నిప్పుల మీద వేసి ఎర్రగా అయ్యే వరకు కాల్చాలి. తరువాత గోధుమపిండిని తీసేసి ఆ ఖర్జూరాన్ని నీటితో కలిపి నూరాలి. ఆ మిశ్రమాన్ని ఒక గ్రాము పరిమాణంలో ఉండే మాత్రలుగా చేసి నిల్వ చేసుకోవాలి. రోజూ ఒక మాత్రను ఒక కప్పు పాలతో కలిపి తీసుకుంటూ ఉంటే ఎటువంటి నొప్పి నడుము నొప్పి అయినా 20 రోజులల్లో తగ్గుతుంది.
ఖర్జూర గింజలను ఎండబెట్టి వాటిని తేనెతో కలిపి నూరాలి. ఆ గంధాన్ని కంది గింజ పరిమాణంలో రోజూ రాత్రి పడుకునే ముందు కళ్లల్లో పెట్టుకోవడం వల్ల కంటి పూలు కరిగిపోతాయి. ఎండు ఖర్జూరాలని నాలుగు ముక్కలుగా కోసి ఒక మట్టి పాత్రలో వేయాలి. అవి మునిగే వరకు నాటు ఆవు నెయ్యిని పోసి ఆ పాత్రపై మూత పెట్టి 20 రోజుల పాటు కదిలించకుండా ఉంచాలి. తరువాత రోజుకు రెండు ముక్కలు రెండు పూటలా నెయ్యితో పాటు కలిపి తినాలి. ఇలా చేయడం వల్ల అమితమైన వీర్య బలం కలుగుతుంది. అంతేకాకుండా 20 గ్రాముల ఖర్జూర పండ్లను, 10 గ్రాముల మర్రి ఊడల కొనలను కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని పావు లీటర్ పాలలో వేసి మరిగించి రెండు పూటలా తాగుతూ ఉంటే వీర్య హీనత తగ్గుతుంది.
100 గ్రాముల ఎండు ఖర్జూరాలన్ని మెత్తగా నూరి పొడిలా చేసుకోవాలి. తరువాత 100 గ్రాముల వామును, 100 గ్రాముల శొంఠిని తీసుకుని దోరగా వేయించి పొడిలా చేసుకోవాలి. వీటన్నింటనీ కలిపి నిల్వ చేసుకోవాలి. బహిష్టు ఆగిన స్త్రీలు రోజుకు రెండు పూటలా అర టీ స్పూన్ నుండి ఒక టీ స్పూన్ మోతాదులో ఒక కప్పు వేడి పాలలో కలుపుకుని తాగడం వల్ల బహిష్టు మరలా ప్రారంభవుతుంది. బహిష్టు ప్రారంభం కాగానే ఈ చూర్ణాన్ని తీసుకోవడం ఆపాలి. ఎండు ఖర్జూరాలను, సీమ బాదం పప్పును, ఎండు ద్రాక్షను, పటిక బెల్లాన్ని సమపాళ్లలో తీసుకుని ఒక మట్టి పాత్రలో ఉంచి అవి మునిగే వరకు స్వచ్ఛమైన తేనెను పోసి పాత్ర మీద మూత పెట్టి వస్త్రాన్ని ఉంచి గాలి చొరబడకుండా గట్టిగా కట్టులా కట్టాలి. ఈ పాత్రను కదిలించకుండా 21 రోజుల పాటు ఉంచాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. పూటకు 10 గ్రాముల మోతాదులో ఆహారానికి ఒక గంట ముందు తింటూ ఉంటే శరీరానికి ఎంతో శక్తి లభించడంతోపాటు రక్త వృద్ధి కూడా జరుగుతుంది.
ఖర్జూర గింజలను కాల్చి బూడిద చేసి ఆ బూడిదను సేకరించి నిల్వ చేసుకోవాలి. ఈ బూడిదను 2 గ్రాముల మోతాదులో అర టీ స్పూన్ కండ చక్కెరతో కలిపి తింటే అన్ని రకాల నీళ్ల విరేచనాలు తగ్గుతాయి. ఖర్జూర గింజలను నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ దాని రసాన్ని మింగుతూ ఉంటే పొట్ట ఉబ్బరం తగ్గుతుంది. ఎండు ఖర్జూర విత్తనాలను దంచి ఆ మిశ్రమాన్ని పాలలో వేసి మరిగించాలి. ఆ పాలను వడకట్టి కొద్ది కొద్దిగా తాగుతూ ఉంటే గొంతు బొంగురు తగ్గి గొంతు సాఫీగా అవుతుంది. ఖర్ఝూర గింజలను నీటితో అరగదీసి ఆ మిశ్రమాన్ని 2 గ్రాముల మోతాదులో ఒకగ్లాస్ నీటిలో కలుపుకుని తాగడం వల్ల మూత్ర విసర్జన సాఫీగా సాగుతుంది. ఈ విధంగా ఖర్జూర పండ్లు మనకు ఔషధంగా కూడా పనికి వస్తాయని నిపుణులు చెబుతున్నారు.