Beerakaya : మనకు అందుబాటులో ఉన్న కూరగాయల్లో బీరకాయలు ఒకటి. ఇవి మనకు అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. వేసవి కాలంలో అయితే ఇవి చేదుగా ఉంటాయి కనుక ఈ ఒక్క సీజన్‌లో వీటిని తినలేరు. మిగిలిన అన్ని కాలాల్లోనూ బీరకాయలను తినవచ్చు. వీటితో అనేక రకాల కూరలను చేసుకుని తింటుంటారు. అయితే వాస్తవానికి బీరకాయ మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. మన శరీరానికి కావల్సిన విటమిన్లు, మినరల్స్ ఎన్నో బీరకాయల్లో ఉంటాయి. ఈ క్రమంలోనే బీరకాయలను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
బీరకాయ అధిక బరువు తగ్గాలనుకునేవారికి వరమనే చెప్పవచ్చు. రోజూ ఒక గ్లాస్ బీరకాయ రసం తాగితే అధిక బరువు త్వరగా తగ్గుతారు. శరీరంలో ఉండే కొవ్వు కరిగిపోతుంది. ఆకలి నియంత్రణలో ఉంటుంది. బీరకాయలో ఉండే ఫైబర్ బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. కనుక బరువు తగ్గాలనుకునే వారు బీరకాయను రోజూ తీసుకోవాలి. దీన్ని జ్యూస్‌లా చేసి ఉదయం పరగడుపున ఒక గ్లాస్ మోతాదులో తాగాలి. దీంతో అనుకున్న ఫలితాలను సాధించవచ్చు.
డయాబెటిస్ ఉన్నవారికి కూడా బీరకాయలు ఎంతో ఉపయోగపడతాయి. వీటిల్లో శరీరానికి కావల్సిన పెప్టైడ్స్, ఆల్కలాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయ పడతాయి. దీని వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. కనుక రోజూ బీరకాయ రసం తాగితే షుగర్ లెవల్స్‌ను కూడా కంట్రోల్ చేయవచ్చు. దీంతో మధుమేహం నియంత్రణలో ఉంటుంది. తద్వారా అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి.
బీరకాయల్లో విటమిన్ ఎ, ఐరన్, మెగ్నిషియం, థయామిన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి. లివర్‌ను శుభ్ర పరుస్తాయి. కాబట్టి బీరకాయను తప్పకుండా తరచూ తీసుకోవాలి. ఇక వీటిల్లో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. రక్తం బాగా తయారయ్యేలా చేస్తుంది. ఇలా బీరకాయతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. కనుక ఇకపై బీరకాయను తేలిగ్గా తీసిపారేయకండి. మార్కెట్‌లో కనిపిస్తే వెంటనే ఇంటికి తెచ్చుకుని తీసుకోండి. బోలెడన్ని లాభాలు పొందవచ్చు.