Mushrooms : మనకు వర్షాకాలంలో ఎక్కువగా లభించే వాటిల్లో పుట్టగొడుగులు కూడా ఒకటి. పూర్వకాలంలో పుట్టగొడుగులు కేవలం వర్షాకాలంలో మాత్రమే లభించేవి. కానీ వ్యవసాయంలో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం కారణంగా వీటిని కాలంతో సంబంధం లేకుండా పెంచుతున్నారు. ప్రస్తుత కాలంలో మనకు పుట్టగొడుగులు విరివిరిగా లభిస్తున్నాయి. పుట్టగొడుగు అనేది ఒకరకమైన శిలీంధ్రం. మనకు అనేక రకాల పుట్టగొడుగులు లభించినప్పటికీ వాటిల్లో కొన్ని మాత్రమే తినడానికి పనికి వస్తాయి.
పుట్టగొడుగులు ఎక్కువగా పుట్టల మీద, నేల మీద, చెట్లకు వస్తాయి. పుట్టగొడుగులను నేరుగా కూరగా చేసుకుని తినవచ్చు. ఎక్కువగా వీటిని వివిధ రకాల ఆహారపదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. పుట్ట గొడుగులను తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. వీటిలో 92 శాతం నీరు ఉంటుంది. అంతేకాకుండా పుట్టగొడుగుల్లో మన శరీరానికి అవసరమయ్యే సోడియం, పొటాషియం, ఐరన్, మెగ్నిషియం, కాల్షియం వంటి మినరల్స్ తోపాటు విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ డి కూడా ఉంటాయి. అంతేకాకుండా ఫైబర్, కార్బొహైడ్రేట్స్ వంటి ఇతర పోషకాలు కూడా పుట్ట గొడుగుల్లో ఉంటాయి.
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో, రక్త హీనత సమస్యను నయం చేయడంలో పుట్టగొడుగులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. పుట్టగొడుగులను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల దంతాలు, ఎముకలు దృఢంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా అధిక రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.
కీళ్ల నొప్పులను తగ్గించడంలో, పలురకాల క్యాన్సర్ల బారిన పడకుండా చేయడంలో కూడా పుట్టగొడుగులు మనకు ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధుల బారిన పడకుండా ఉంటాం. కనుక పుట్టగొడుగులను తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.