ప్రపంచంలో ఉన్న దాదాపు అధిక శాతం వస్తువులు కుడి చేతి వాటం ఉన్న వారిని దృష్టిలో ఉంచుకుని తయారు చేసినవే. ఉదాహరణకు కంప్యూటర్ మౌస్‌నే తీసుకోండి. దాన్ని సాధారణంగా ఎవరైనా కుడి చేయి వైపు ఉంచుకునే ఆపరేట్ చేస్తారు. అందుకు అనుగుణంగానే దాని బటన్లు కూడా ఉంటాయి. కారు లాంటి వాహనాలు కూడా అంతే. కుడి చేయి వారికి అనువుగా ఉంటాయి. ఇంకా ముందుకు వెళితే ఇలాంటివి మనకు అనేకం కనబడతాయి. అయితే అలాంటి వాటిలో చొక్కా కూడా ఒకటి. అదేంటి, చొక్కాకు, చేతి వాటానికి సంబంధం ఏముంది? అనబోతున్నారా..? అయితే ఇది చదవండి. ఆ సంబంధం ఏమిటో తెలుస్తుంది.
చొక్కాలను ఇప్పుడు ఆడ, మగ తేడా లేకుండా అందరూ ధరిస్తున్నారు. కానీ వాటికి ఉండే జేబుల్ని మీరు ఎప్పుడైనా గమనించారా..? అంటే కొన్ని రకాల టీషర్ట్స్‌కు అస్సలు జేబులే ఉండవు లెండి, అది వేరే విషయం. అయితే జేబులున్న చొక్కాలను మీరెప్పుడైనా జాగ్రత్తగా పరిశీలించారా..? అందులో ఏం తెలుస్తోంది..? అబ్బే, ఏమీ తెలియడం లేదంటారా..? జాగ్రత్తగా చూడండి, చొక్కా జేబు ఎడమ వైపుకు ఉంటుంది. ఆ… ఉంది కదా..! ఇంతకీ అలా అన్ని చొక్కాలకు ఎడమ వైపుకే జేబు ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా..? లేదా..? అయితే అలా ఎందుకు ఉంటుందో తెలుసుకుందాం.
పైన ఇంతకు ముందే చెప్పాం కదా. కుడి, ఎడమ చేతి వాటాల గురించి. ఆ… అదే. దాన్ని దృష్టిలో ఉంచుకునే చొక్కా జేబులను కూడా ఎడమ వైపుకే పెట్టడం ప్రారంభించారు. అంటే అది, ఎడమ చేతి వాటం కలిగిన వారిని దృష్టిలో ఉంచుకుని కాదు, కుడి చేతి వాటం ఉన్న వారిని దృష్టిలో ఉంచుకుని చొక్కా జేబులను అలా ఎడమ వైపుకు పెట్టడం ప్రారంభించారు. ఎందుకంటే, ప్రపంచంలో ఎక్కువగా ఉన్నది కుడి చేతి వాటం వారే కావడం, వారికి చొక్కా జేబు ఎడమ వైపు ఉంటేనే సౌకర్యవంతంగా ఉంటుండడంతో అలా జేబులను ఎడమ వైపుకు పెట్టి కుట్టడం ప్రారంభించారు. అలా అది కొనసాగుతూ వస్తోంది. అందుకే చొక్కాకు, చేతి వాటానికి సంబంధం ఉంటుందని పైన చెప్పాం. మరి ఎడమ చేతి వాటం ఉన్న వారి పరిస్థితి ఏంటని మీరు అడిగితే, అలాంటి వారి కోసమే కొన్ని కంపెనీలు రెండు జేబులు ఉన్న చొక్కాలను తయారు చేయడం షురూ చేశాయి. దీంతో అవి రెండు చేతి వాటాలు కల వారికి ఉపయోగకరంగా ఉండడమే కాదు, ఫ్యాషన్‌గా కూడా ఉన్నాయి. ఈ క్రమంలో అలాంటి చొక్కాలను అధిక శాతం మంది వేసుకుంటున్నారు. ఇప్పుడర్థమైందా, చొక్కాలకు జేబులను ఎడమ వైపుకే ఎందుకు పెడతారో..!