Off Beat

ఎంత‌గానో ప్రేమించే భార్యను పోగొట్టుకున్న త‌రువాత కానీ ఆ భ‌ర్త‌కు అస‌లు విష‌యం తెలిసి రాలేదు..!

భార్య చనిపోయి ఇప్పటికీ నాలుగురోజులు గడిచిపోయాయి.. తన అంత్యక్రియలకు వచ్చిన బంధువులు ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు.. చివరికి ఆ ఇంట్లో నేను, నా పిల్లలు మిగిలాము… తను నాతోపాటు లేదు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను.. ప్రతి విషయానికి ఏమండీ…… అనే పిలుపుకు నేను దూరమయ్యాను.. నన్ను, నా పిల్లలను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తను ఇప్పుడు లేదు.. ఎప్పుడూ మమ్మల్ని అతిగా ప్రేమించే తను మమ్మల్ని వదిలి వెళ్ళిన సందర్భాలు లేవు.. ఒకవేళ పుట్టింటికి వెళ్ళినా కూడా మా గురించి ఆలోచించి సాయంత్రానికల్లా తిరిగి వచ్చేది…

నిజానికి తను వెళ్ళడం నాకు ఇష్టం ఉండేది కాదు.. వంట మరియు ఇతర పనులు చేసుకోవాల్సి వస్తుందనే స్వార్థం నాలో ఉండేది.. సెలవు దినాలలో నేను మరియు పిల్లలు టివి చూస్తూ ఆనందిస్తుంటే, తను మాత్రం వంటింట్లో వంట చేయడంలో బిజీగా ఉండేది.. ఎప్పుడైనా మాతో పాటు టివి చూడటానికి కూర్చుంటే అమ్మా… నీళ్లు, అమ్మా… తినడానికి ఏమైనా తీసుకురా.., కొంచెం కాఫీ పెట్టవోయ్ అంటూ .. తనని మళ్లీ వంటింట్లోకి పంపించేవాళ్ళం… నేను అడగకుండానే అర్థం చేసుకుని నా అన్ని పనులు చేసి పెట్టేది.. ఇప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్లకు మరియు కప్పు కాఫీ చేసుకోవడానికి తను జతగా లేదన్న చేదు నిజాన్ని మరవలేకపోతున్నాను..

man feels shame afer losing his wife

తన ఇష్టాలను సహితం నేను గుర్తించలేకపోయాను.. సినిమాలకు గానీ షికారులకు గానీ తీసుకువెళ్ళలేకపోయాను.. తను కూడా ఎప్పుడూ అడిగింది లేదు.. ఆఫీసు నుండి లేటు వచ్చినపుడు ఎందుకు లేటయ్యింది అనే తన ప్రశ్నకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేవాడిని.. ఏమండీ… పాలవాడికి డబ్బులు..,పేపర్ వాడికి డబ్బులు.., కరెంట్ బిల్లు.., పిల్లల ఫీజులు కట్టే విషయం మరీ మరీ గుర్తుచేసేది.. చివరకు నాకు సంబంధించిన బిపి మాత్రలు, షుగర్ మాత్రలు కూడా అయిపోకముందే తెచ్చుకొండని మరీ మరీ గుర్తుచేసేది.. ఇప్పుడు అవన్నీ గుర్తుచేయడానికి తనులేదు.. తన గురించి ఎప్పుడూ, ఏది కావాలని నోరు తెరచి అడిగింది లేదు..

రాత్రి పని అంతా ముగించుకుని నా పక్కన పడుకున్నప్పుడు.. ఏమండీ… ఎదలో నొప్పిగా ఉంది .,నడుము నొప్పిగా ఉంది.., కాళ్ళు నొప్పిగా ఉన్నాయి అన్నప్పుడు అవన్నీ పని అలసట వల్ల అని చెప్పి అటు తిరిగి పడుకునేవాడిని.. చివరికీ ఆ ఎద నొప్పి హార్ట్_ఎటాక్ రూపంలో వచ్చి తనను తీసుకు వెళ్లేవరకు నేను గుర్తించలేకపోయాను.. ఇంట్లో అంతా కొత్త.. వంటింట్లో ఏది ఎక్కడ ఉందో తెలియని పరిస్తితి.. ఉదయం నుండి తిన్న ప్లేట్లు, పాత్రలు అన్నీ సింక్ నిండా అలాగే పడిఉన్నాయి.. పిల్లలు ఏది పట్టనట్లు తమ తమ మొబైల్స్ తో బిజీగా గడుపుతున్నారు.. తను ఉన్నన్నీ రోజులు అన్ని సులభంగా అయ్యే పనులు.., ఇప్పుడు మాకు భారంగా అనిపిస్తున్నాయి.. పిల్లలు తమకు కావాల్సిన నూడుల్స్ తిని ఖాళీ పాకెట్స్ కూడా సింక్ లో పడేసారు.. అన్ని పాత్రలు కడిగేసి.. ఫ్రిడ్జ్ లో ఉన్న ఆపిల్ పండు తినేసి పడుకుందామని భారంగా బెడ్రూం వైపు నడిచాను.. లైట్ ఆఫ్ చేసి పడుకుందామనేలోపు గోడ మీద వేలాడుతున్న తన భావ చిత్రాన్ని చూసి తెలియకుండానే కళ్ళలో నీళ్లు వచ్చాయి.. తనను నిర్లక్ష్యము చేయకుంటే నేను, నా పిల్లలు ఇంకొన్ని రోజులు సంతోషంగా ఉండేవాళ్ళం అని తలచుకుంటూ భారంగా కళ్ళుమూసాను…

Admin

Recent Posts