దేశాన్ని, దేశ ప్రజలను రక్షించడంలో ఆర్మీ కీలకపాత్ర పోషిస్తుంది. మాతృదేశాన్ని రక్షించాలనే తపనతో ఎంతో మంది యువకులు ఆర్మీలో చేరుతుంటారు కూడా. ఎన్నో కష్టాలను తట్టుకుంటూ సరిహద్దుల్లో దేశం కోసం కాపలా కాస్తూ సైనికులు విధులు నిర్వహిస్తుంటారు. విపత్కర పరిస్థితులు వస్తే ఎంతో చాకచక్యంగా వ్యవహరించి దేశాన్ని ఆపద నుంచి రక్షిస్తారు. అందుకోసం వీలైతే ప్రాణాలను కూడా పణంగా పెడతారు. అయితే సైనికులు ఎంత వీరోచితంగా పోరాడినా సరైన ఆయుధాలు లేకపోతే వారు శత్రుదేశ సైనికులను ఎదుర్కొనలేరు. అలాంటి బలమైన ఆయుధాల్లో ఫిరంగి కూడా ఒకటి. ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువులనైనా కాల్చి బూడిద చేయగల శక్తి ఆ యుద్ధ ట్యాంకుల సొంతం. అయితే మీరెప్పుడైనా అలాంటి శక్తివంతమైన ఫిరంగులను చూశారా? ఎక్కడో బహిరంగ ప్రదేశంలోనో, ఏదైనా పార్క్ వద్దో, ఆర్మీ ఉండే ప్రాంతంలోనో ఫిరంగులను చూసే ఉంటారు లెండి. కానీ వాటి బ్యారెల్ (పొడవైన గొట్టం)ను జాగ్రత్తగా పరిశీలించారా? పరిశీలించే ఉంటారు కానీ, దాని గురించిన విషయం ఒకటి మీకు తెలిసి ఉండదు. అదేమిటంటే…
పైన చెప్పినట్టుగా ప్రజలు ఎక్కువగా తిరిగే ఏదైనా ప్రదేశంలో ఫిరంగులను పెడితే సాధారణంగా వాటి బ్యారెల్స్‌ను పైకి లేపి ఉంచడమో, సమానంగా ఉంచడమో, కిందకి వంచి ఉంచడమో చేస్తారు. అయితే అసలు అలా బ్యారెల్స్‌ను ఎందుకు పెడతారో తెలుసా? ఫిరంగి బ్యారెల్ పైకి లేపి ఉంచితే ఆ ఫిరంగితో ఏదో ఒక యుద్ధంలో గెలిచినట్టు అర్థం చేసుకోవాలి. సైనికులు తమ విజయానికి చిహ్నంగా ఫిరంగి బ్యారెల్‌ను అలా పైకి లేపి ఉంచుతారు.
అదే బ్యారెల్‌ను సమానంగా ఉంచితే శాంతియుత వాతావరణం ఉన్నప్పుడు ఆ ఫిరంగిని ఉపయోగించారని అర్థం చేసుకోవాలి. లేదంటే ఆ ఫిరంగి ఏదైనా ఒరిజినల్ యుద్ధ ట్యాంక్‌కు నమూనా (replica) అయినా అయి ఉండాలి.
ఇక ఫిరంగి బ్యారెల్‌ను కిందకి ఉంచితే దాన్ని యుద్ధంలో శత్రువుల నుంచి లాక్కున్నట్టు తెలుసుకోవాలి. అలాంటి ఫిరంగుల బ్యారెల్స్‌ను కిందకి ఉంచుతారు. ఇప్పుడు తెలిసిందా? యుద్ధ ట్యాంకుల బ్యారెల్స్‌ను అలా ఎందుకు ఉంచుతారో!