నా వయస్సు 35 ఏళ్లు. నా చిన్నతనంలోనే నాన్న చనిపోయాడు. అమ్మే నన్ను కష్టపడి చదివించింది. ఇంత వయస్సు వచ్చినా ఇంకా పెళ్లి కావడం లేదు అని ఆమె తరచూ భయపడుతుండేది. ఒక సంబంధం వచ్చింది. పెళ్లి కొడుకుకి మంచి జాబ్ అని చెప్పారు. అతని వయస్సు 37. నాకన్నా 2 ఏళ్లు పెద్ద. మంచి సంబంధం, ఇంకా లేట్ అయితే పెళ్లి కాదు అన్న భయంతో బంధువులు, స్నేహితులు, అమ్మ అందరూ నాకు నచ్చజెప్పి పెళ్లి చేశారు. వారు చెప్పినట్లే అతను చాలా సున్నిత మనస్కుడు. ఆ రోజు మా మొదటి రాత్రి. ఇద్దరం మాట్లాడుకున్నాం.
తనకు జీతం రూ.25వేలు వస్తుందని చెప్పాడు. భవిష్యత్తులో పెరుగుతుందని కూడా అన్నాడు. తనకు పెద్దగా ఖర్చులు, అప్పులు కూడా లేవని చెప్పాడు. మరీ రూ.25వేలు అంటే చాలా తక్కువ కదా. అంత తక్కువ జీతంతో ఎలా నెట్టుకు రావాలని ఆలోచించా. నెల రోజులు గడిచింది. జీతం ఇచ్చారేమో మొత్తం తెచ్చి నా చేతిలో పెట్టాడు. అందులో నుంచి రూ.5వేలు మాత్రం తీసి పొదుపు కోసం దాస్తున్నానని చెప్పాడు. అయినా సరే ఆ డబ్బు చాలదని చెప్పా. లెక్కలన్నీ వేసి చూసినా ఆ డబ్బు సరిపోవడం లేదు. అదే అతనికి చెప్పా.
ఎలాగోలా సర్దుకుందాం అని చెప్పాడు. ఒక్క క్షణం నాకు నా స్నేహితులు చెప్పింది గుర్తుకు వచ్చింది. భర్తకు పడక గదిలో సుఖాన్ని అందించు, అతను నీ కోసం ఏం కావాలన్నా చేస్తాడు.. అని చెప్పిన వారి మాటలను గుర్తు చేసుకున్నా. వారు చెప్పినట్లే చేశా. కనీసం అలా అయినా ఎక్కువ డబ్బులు సంపాదిస్తాడేమోనన్న ఆశతో. కానీ అలా జరగలేదు. కొన్ని నెలలు గడిచాయి. ఖర్చులకు డబ్బులు సరిపోకపోవడంతో తరచూ అతనితో గొడవకు దిగాల్సి వస్తోంది. కానీ అతను మాత్రం ఎంతసేపు సర్దుకుందాం అనే చెప్తున్నాడు. ఒక రోజు గొడవ జరిగి కోపంతో అమ్మ దగ్గరికి వచ్చేశా. తను చాలా సార్లు వచ్చి నన్ను తీసుకెళ్లేందుకు బతిమాలాడు. అయినా నేను వినలేదు. అదే నేను చేసిన తప్పు. ఒక రోజు లాయర్ నోటీస్ పంపించాడు. విడాకులు కావాలని అడిగాడు. అందుకు నేను కూడా ఒప్పుకున్నా. చాలీ చాలని డబ్బు తెచ్చే భర్త వేస్ట్ అని అనుకున్నా. విడాకులు మంజూరు అయ్యాయి.
డబ్బు విలువ నాకు ఇప్పుడే తెలిసి వస్తోంది. డబ్బు సంపాదించడం ఇంత కష్టమా అని ఇప్పుడే అనిపిస్తోంది. ఇంటి పట్టునే ఉండుంటే అప్పుడు ఆయన నాకు రూ.20వేలు ఇచ్చేవాడు. ఇప్పుడు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు పనిచేసినా రూ.15వేలే వస్తోంది. అందులోనూ భర్త వదిలేసిన నాలాంటి ఆడది అంటే అందరికీ లోకువే. ప్రతి మగాడు ఒక అవకాశం కోసం నా దిక్కు చూడడం మొదలు పెట్టారు. ఇంత కష్టపడి డబ్బు సంపాదిస్తూ జీవిస్తున్న నా జీవితం నాకే కష్టంగా మారింది. ఇప్పుడు ఆయనకు జీతం రూ.86వేలు. ఆయన అప్పుడే చెప్పాడు, భవిష్యత్తులో జీతం పెరుగుతుందని, అప్పుడు ఆయన మాట విని ఉన్నా, ఇప్పుడు రాణిలాగా జీవించేదాన్ని. నా జీవితం ఇలా అయిపోయినందుకు చింతిస్తున్నా. జీతం తక్కువ ఉందని మగాళ్లను ఎప్పుడూ చిన్నచూపు చూడకూడదని తెలుసుకున్నా. ఎంతో అర్థం చేసుకునే భర్తను మిస్ చేసుకున్నందుకు ఫీలవుతున్నా.