Parika Pandlu : ప్రకృతి మనకు కొన్ని రకాల పండ్ల చెట్లను సహజ సిద్ధంగా పెంచి అందిస్తోంది. అలాంటి వాటిల్లో పరిక పండ్ల చెట్టు కూడా ఒకటి. గ్రామాల్లో, అటవీ ప్రాంతాల్లో, రోడ్డుకు ఇరు వైపులా పరిక పండ్ల చెట్టు ఎక్కువగా పెరుగుతుంది. ఈ పండ్ల చెట్టు ముళ్లులను కలిగి ఉంటుంది. ఇతర చెట్లను ఆధారంగా చేసుకుని ఈ చెట్టు ఎక్కువగా పెరుగుతుంది. దీనిని ఆంగ్లంలో జాక్ అండ్ జుజుబ్ అని పిలుస్తారు. మనలో చాలా మంది ఈ పరిక పండ్లను తినే ఉంటారు.
ఈ పరిక పండ్లు లేతగా ఉన్నప్పు ఆకుపచ్చ రంగులో, పక్వానికి వచ్చినప్పుడు ఎరుపు రంగులో, పండిన తరువాత నలుపు రంగులో ఉంటాయి. ఈ కాయలను గింజలతో సహా నమిలి తింటారు. పరిక పండ్లు తీపి, పులుపు రుచులను కలిగి ఉంటాయి. సహజ సిద్ధంగా దొరికే ఈ పండ్లను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ పరికె పండ్లను తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతోపాటు గుండె సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ పండ్లల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. పరిక పండ్లే కాకుండా పరిక చెట్టు ఆకులు కూడా మనకు ఉపయోగపడతాయి. గాయాలు తగిలినప్పుడు ఈ మొక్క ఆకులను మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని గాయాలపై ఉంచి కట్టుకట్టడం వల్ల గాయాల నుండి రక్తం కారడం ఆగడంతోపాటు గాయాలు కూడా త్వరగా మానుతాయి. ఈ విధంగా పరిక చెట్టు ఆకులు, పండ్లు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.