Garlic : మన వంటింట్లో కచ్చితంగా ఉండాల్సిన పదార్థాల్లో వెల్లుల్లి కూడా ఒకటి. దీనిని పచ్చళ్లల్లో, కూరల్లో విరివిరిగా వాడుతూ ఉంటాం. వెల్లుల్లిని నేరుగా లేదా అల్లంతో కలిపి వాడుతూ ఉంటాం. వంటల్లో ఉపయోగించే ఈ వెల్లుల్లిలోని ఔషధగుణాల గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. దీనిలో ఉండే ఔషధ గుణాలను గుర్తించిన మన పెద్దలు ఈ వెల్లుల్లిని మన వంటల్లో భాగం చేశారు. ఉల్లి వర్గానికి చెందిన ఈ వెల్లుల్లిని ఆంగ్లంలో గార్లిక్ అని పిలుస్తారు. వెల్లుల్లి గొప్పతనం గురించి ఆయుర్వేద గ్రంథాలలో ఎంతో గొప్పగా వర్ణించబడింది. మన దేశంతోపాటు ఇతర దేశాల వారు కూడా వెల్లుల్లిని ఔషధంగా ఉపయోగిస్తారు. సంప్రదాయ చైనా వైద్యంలో వెల్లుల్లిని విరివిరిగా ఉపయోగిస్తారు. వెల్లుల్లిలో ఉన్న ఔషధ గుణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతిరోజూ పరగడుపున మూడు వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీనిని తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు పొట్టలో ఉండే చెడు బాక్టీరియా నశిస్తుంది. వెల్లుల్లిని తరచూ తినడం వల్ల ఉబ్బసం, దగ్గు, జ్వరం, కడుపులో నులి పురుగులు, కాలేయం సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వెల్లుల్లిలో జీర్ణశక్తిని మెరుగుపరిచే గుణం కూడా ఉంది. అజీర్తితో బాధపడే వారు వెల్లుల్లిని తినడం వల్ల అజీర్తి సమస్యతోపాటు ఉదర సంబంధిత సమస్యల నుండి కూడా బయటపడవచ్చు. వెల్లుల్లిని తినడం వల్ల నోటి సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి.
వెల్లుల్లి రెబ్బలను పాలల్లో వేసి మరిగించి తాగడం వల్ల ఉబ్బసం సమస్య నుండి బయట పడవచ్చు. శరీరంలో వాపులు ఉన్న చోట వెల్లుల్లి రసాన్ని రాయడం వల్ల వాపులు తగ్గుతాయి. రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి రక్త సరఫరా సాఫీగా సాగేలా చేసే గుణం కూడా వెల్లుల్లిలో ఉంటుంది. వెల్లుల్లిని తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. వేడి నీటిలో నిమ్మరసం, రెండు వెల్లుల్లి రెబ్బల రసాన్ని కలుపుకుని రోజుకు రెండు పూటలా తాగుతూ ఉండడం వల్ల అధిక బరువు సమస్య నుండి బయట పడవచ్చు. అర గ్లాసు నీటిలో 8 చుక్కల వెల్లుల్లి రసాన్ని కలుపుకుని తాగడం వల్ల మోకాళ్ల నొప్పుల సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.
దీనిలో లైంగిక సామర్థ్యాన్ని పెంచే శక్తి కూడా ఉంటుంది. నరాల బలహీనత, శీఘ్రస్కలనం, లైంగిక సామర్థ్యం తక్కువగా ఉండడం వంటి సమస్యలతో బాధపడే వారు రోజూ వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల కొద్ది రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది. వెల్లుల్లిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరగడంతోపాటు వీర్య కణాల సంఖ్య కూడా పెరుగుతుంది. ఆరోగ్యానికి మేలు చేసేది అయినప్పటికీ వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోకూడదు. పిల్లలకు దీనిని చాలా తక్కువ మోతాదులో ఇవ్వాలి. కొందరికి వెల్లుల్లిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల దురదులు, దద్దుర్లు, అలర్జీ, తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వెల్లుల్లిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని నిపుణులు తెలియజేస్తున్నారు.