Atibala : మన చుట్టూ అనేక రకాల ఔషధ మొక్కలు ఉంటాయి. కానీ అవి ఔషధ మొక్కలని వాటిలో ఔషధ గుణాలు ఉంటాయని తెలియక మనం వాటిని పిచ్చి మొక్కలుగా భావిస్తూ ఉంటాము. అలాంటి కొన్ని రకాల మొక్కలల్లో అతిబల మొక్క కూడా ఒకటి. దీనిని ముద్రబెండ, తుత్తురు బెండ, దువ్వెనకాయల చెట్టు అని కూడా పిలుస్తారు. గ్రామాల్లో ఈ మొక్క తెలియని వారు ఉండరనే చెప్పవచ్చు. ఎక్కడపడితే అక్కడ ఈ మొక్క పెరుగుతుంది. ఈ మొక్కలో ప్రతి భాగం కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దీనిని ఉపయోగించి మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. అతిబల మొక్క ఉపయోగాలు ఏమిటి… దీనిని మనం ఔషధంగా ఏ విధంగా ఉపయోగించాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దీనిని సంస్కృతంలో అతిబల అని, హిందీలో కంటి అని పిలుస్తారు. గుంఎను ఆరోగ్యంగా ఉంచడంలో అతి బల మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అతిబల మొక్క వేర్లను పొడిగా చేసి జల్లించి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని నాలుగు చిటికెల మోతాదులో రెండు పూటలా భోజనానికి గంట ముందు ఆవునెయ్యితో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు చర్మం కూడా కాంతివంతంగా తయారవుతుంది. తీవ్రజ్వరంతో బాధపడుతున్నప్పుడు అతిబలాకులను శుభ్రంగా కడిగి నీటిలో నానబెట్టాలి. తరువాత ఆకులను తీసేసి నీటిని కొద్ది కొద్దిగా తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో వేడి క్రమంగా తగ్గుతుంది. అలాగే పిచ్చి కుక్క కరిచి నప్పుడు అతిబల ఆకుల రసాన్ని 70 గ్రాముల మోతాదులో తాగించాలి. అలాగే ఆకుల ముద్దను కాటు వేసిన చోట ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల విషం హరించుకుపోతుంది.
అలాగే మూత్రపిండాల్లో రాళ్లను, మూత్రంలో మంటను తగ్గించడంలో కూడా అతిబల మొక్క మనకు సహాయపడుతుంది. నాలుగు లేదా ఐదు అతిబల ఆకులను పావు లీటర్ నీటిలో వేసి మరిగించాలి. ఈ నీరు సగం అయ్యే వరకు మరిగించి వడకట్టాలి. తరువాత ఇందులో కండచెక్కర కలిపి మూడు పూటలా తాగుతూ ఉంటే మూత్రంలో రాళ్లు కరిగి పోతాయి. ఇలా తయారు చేసుకున్న కషాయంతో కళ్లు మూసి కళ్లపై కడుక్కోవడం వల్ల కంటి సమస్యలు తగ్గి కంటి చూపు మెరుగుపడుతుంది. అదే విధంగా పురుషుల్లో వచ్చే శీఘ్రస్కలన సమస్యను తగ్గించడంలో కూడా తుత్తురు బెండ గింజలు మనకు సహాయపడతాయి. అతిబల గింజలు 50 గ్రాములు, శతావరి వేర్ల పొడి 100 గ్రాములు తీసుకోవాలి. వీటిని సమానంగా పటిక బెల్లం పొడిని కలిపి నిల్వ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న పొడిని పూటకు ఒక టీ స్పూన్ మోతాదులో రెండు పూటలా నోట్లో వేసుకుని చప్పరించి మింగాలి. తరువాత ఒక కప్పు పాలు తాగాలి. ఇలా చేయడం వల్ల పురుషుల్లో వచ్చే శీఘ్రస్కలన సమస్య తగ్గడంతో పాటు వారిలో వీర్య కణాల సంఖ్య కూడా పెరుగుతుంది. అలాగే అతిబలవేరును నీటితో ఆరగదీయాలి. ఈ గంధాన్ని రోజుకు రెండు పూటలా స్త్రీలు స్తనాలపై రాసుకుంటూ ఉంటే స్థనాల వాపులు తగ్గుతాయి. అతిబల ఆకులు 21, మిరియాలు 21 చొప్పున తీసుకుని మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని ఒకే పరిమాణంలో ఏడు మాత్రలుగా చేసుకోవాలి. ఏడు రోజుల పాటు రోజూ ఉదయం పరగడుపున ఒక మాత్రను మంచి నీటితో తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల వాతదోషం వల్ల వచ్చిన మొలలు హరించుకుపోతాయి.
అలాగే అతిబల మొక్క ఆకులను కూరగా వండుకుని తింటూ ఉంటే మొలల నుండికారే రక్తం తగ్గుతుంది. అతిబల ఆకులను నీటిలో వేసి కషాయంలా చేసుకోవాలి. ఈ కషాయాన్ని వడకట్టుకుని తాగడంతో పాటు ఆకులను మెత్తగా నూరి వేడి చేయాలి. తరువాత దీనిని నొప్పులు ఉన్న చోట ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో నొప్పులు తగ్గుతాయి. ఈవిధంగా అతిబల మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని ఉపయోగించడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.