Dushtapu Theega : మన చుట్టూ మనకు ఎంతగానో ఉపయోగపడే అనేక రకాల మొక్కలు ఉన్నాయి. కానీ వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక మనం అనారోగ్యాల బారిన పడినప్పుడు ఎంతో డబ్బును ఖర్చు చేస్తున్నాం. మనకు ఉపయోగపడే మొక్కలలో దుష్టపు తీగ మొక్క కూడా ఒకటి. దీనిని చాలా మంది చూసే ఉంటారు. కానీ ఈ మొక్కలో ఉండే ఔషధ గుణాల గురించి మనలో చాలా మందికి తెలియదు. దీనిని జుట్టుపాదాకు అని కూడా పిలుస్తూ ఉంటారు. చేను కంచెల వెంబడి, గుబురుగా ఉండే చెట్లకు అల్లుకుని దుష్టపు తీగ మొక్క ఎక్కువగా పెరుగుతుంది. ఇది చూడడానికి తిప్ప తీగ లాగా ఉంటుంది.
దుష్టపు తీగ మొక్కకు గుంపులు గుంపులుగా పూలు పూస్తాయి. ఈ తీగ కాయలు గొంగళి పురుగుల లాగా ఉంటాయి. ఈ మొక్క ఆకులను, కాయలను, పువ్వులను తుంచినప్పుడు వాటి నుండి పాలు కారుతాయి. పిచ్చి మొక్కగా భావించే ఈ దుష్టపు తీగ మొక్క మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఎంతగానోఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో దీనిని ఔషధంగా ఉపయోగించి అనేక రోగాలను నయం చేస్తున్నారు. దుష్టపు తీగ మొక్కతో ఏయే వ్యాధులను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. తేలు విషం హరించేలా చేయడంలో ఈ మొక్క సహాయపడుతుంది. తేలు కాటుకు గురైనప్పుడు ఈ మొక్క వేరును సేకరించి దానిని మంచి నీటితో కలిపి నూరి ఆ గంధాన్ని తేలు కాటు వేసిన చోట లేపనంగా రాయాలి. ఇలా చేయడం వల్ల తేలు విషం హరించుకుపోతుంది.
చెవిలో చీము కారే సమస్య ఉన్న వారు దుష్టపు తీగ ఆకులను దంచి రసాన్ని తీసి ఆ రసంలో రాళ్ల ఉప్పును వేసి కరిగించి దానిని 2 నుండి 3 చుక్కల మోతాదులో చీము కారుతున్న చెవిలో వేయాలి. ఇలా చేయడం వల్ల చెవి నుండి చీము కారడం తగ్గుతుంది. స్త్రీలలో వచ్చే గర్భ దోషాలను పొగొట్టి సంతానం కలిగేలా చేయడంలో కూడా ఈ మొక్క ఉపయోగపడుతుంది. దుష్టపు తీగ మొక్క వేరును సేకరించి ఎండబెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ మజ్జిగలో లేదా పెరుగులో కలుపుకుని పరగడుపున బహిష్టు మొదలైన రోజు నుండి ఐదవ రోజు వరకు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల సమస్యలు తొలగిపోయి సంతానం కలుగుతుంది.
పిప్పి పన్ను సమస్యతో బాధపడుతున్న వారు ఈ దుష్టపు తీగ వేరును మిరియాలతో కలిపి దంచి ఆ ముద్దను పిప్పి పన్నుపై ఉంచాలి. ఇలా చేయడం వల్ల పిప్పి పన్ను వల్ల కలిగే నొప్పి తగ్గుతుంది. ఈ విధంగా దుష్టపు తీగను ఉపయోగించడం వల్ల అనారోగ్య సమస్యల నుండి మనం బయట పడవచ్చని నిపుణులు చెబుతున్నారు.