మన చుట్టూ ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉంటాయి. కానీ వాటిల్లో ఉండే ఔషధ గుణాల గురించి తెలియక మనం వాటిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాం. మనకు ఎంతగానో ఉపయోగపడే ఔషధ మొక్కల్లో గడ్డి చామంతి మొక్క కూడా ఒకటి. ఈ మొక్క మనకు విరివిరిగా కనబడుతుంది. గడ్డి చామంతి మొక్క ఆకులు దీర్ఘ అండాకారంలో ప్రస్ఫుటపు మొన దేలిన అంచులను కలిగి ఉంటాయి. ఈ మొక్క శాస్త్రీయనామం ట్రైడాక్స్ ప్రొకంబన్స్. దీనిని ఆంగ్లంలో మెక్సికన్ డైసీ అని, సంస్కృతంలో జయంతివేద అని పిలుస్తారు.
అలాగే మన దగ్గర కూడా దీనిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తారు. గడ్డి చామంతి మొక్కకు గాయపాకు, వైశాలకర్ణి, రావణాసుర తల వంటి పేర్లు కూడా ఉన్నాయి. ఈ మొక్క ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ మొక్కను అనేక రకాల అఆరోగ్య సమస్యలను నయం చేయడంలో ఔషధంగా ఉపయోగిస్తారు. గడ్డి చామంతి మొక్కలో ఆల్కలాయిడ్లు, ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్లు వంటి వాటితోపాటు సోడియం, పొటాషియం, కాల్షియం వంటి మినరల్స్ కూడా అధిక మొత్తంలో ఉంటాయి.
ఈ మొక్క ఆకులు యాంటీ సెప్టిక్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. గాయాలు తగిలినప్పుడు, తెగినప్పుడు ఈ మొక్క ఆకుల నుండి తీసిన రసాన్ని రాయడం వల్ల రక్తం కారడం ఆగడమే కాకుండా గాయాలు కూడా త్వరగా మానుతాయి. ఈ మొక్క ఆకుల రసాన్ని ఉపయోగించి దగ్గు, జలుబు, ఆయాసం వంటి శ్వాస సంబంధిత సమస్యల నుండి బయటపడవచ్చు. జుట్టు రాలడం సమస్యతో బాధపడే వారు గడ్డి చామంతి మొక్క ఆకుల రసం, గుంటగలగరాకు మొక్క ఆకుల రసం, నువ్వుల నూనెను సమపాళ్లలో తీసుకుని చిన్న మంటపై కేవలం నూనె మిగిలే వరకు మరిగించాలి. ఈ నూనెను వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలడం సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
గడ్డి చామంతి మొక్కకు షుగర్ ను నియంత్రించే గుణం కూడా ఉంటుంది. ఇందులో ఉండే జోలియో లోనిక్ అనే రసాయనం కారణంగా షుగర్ వ్యాధిని నియంత్రించ వచ్చని నిపుణులు చెబుతున్నారు. చర్మ వ్యాధులతో బాధపడే వారు ఈ మొక్క ఆకుల రసాన్ని లేపనంగా రాయడం వల్ల చర్మ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ మొక్క ఎండిన ఆకులతో పొగను వేయడం వల్ల ఇంట్లో ఉండే దోమలు పారిపోతాయి. ఈ విధంగా గడ్డి చామంతి మొక్క మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుందని.. దీనిని తగిన విధంగా ఉపయోగించడం వల్ల అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చని.. నిపుణులు తెలియజేస్తున్నారు.