Shatavari Plant : మన చుట్టూ ప్రకృతిలో అనేక రకాల మొక్కలు పెరుగుతుంటాయి. వాటిల్లో చాలా వరకు మొక్కల్లో ఔషధ గుణాలు ఉంటాయి. కానీ వాటి గురించి మనకు తెలియదు. మన చుట్టూ పరిసరాల్లో కనిపించే అనేక రకాల మొక్కలు చూసేందుకు పిచ్చి మొక్కల్లా ఉంటాయి. కొన్ని అలంకరణ మొక్కల్లా ఉంటాయి. కానీ వాటిల్లోనూ ఔషధ గుణాలు ఉండే మొక్కలు చాలానే ఉన్నాయి. వాటిల్లో శతావరి కూడా ఒకటి. ఇది చూసేందుకు అలంకరణ మొక్కలా ఉంటుంది. కానీ దీంతో కలిగే లాభాలు తెలిస్తే అసలు విడిచిపెట్టరు. మనకు శతావరి మొక్క ఎక్కువగా పంట చేలల్లో కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో శతావరి మొక్కలు మనకు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఈ మొక్కలు ఎక్కడ కనిపించినా సరే విడిచిపెట్టకుండా తెచ్చుకోండి. ఎందుకంటే ఈ మొక్కతో మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
శతావరి మొక్కను కొన్ని ప్రాంతాల్లో పిల్లి పీచర గడ్డలు, పిల్లి తీగలు, చందమామ గడ్డలు అనే పేర్లతో పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం యాస్పరగస్ రెసిమొసిస్. ఇది తీగజాతికి చెందిన ముళ్ల మొక్క. దీని వల్ల పంట చేలకు కూడా రక్షణ లభిస్తుంది. ఇక ఆయర్వేద పరంగా శతావరి మొక్కతో అనేక లాభాలు కలుగుతాయి. అనేక వ్యాధులకు దీన్ని ఔషధంగా ఉపయోగిస్తారు. పలు ఆయుర్వేద ఔషధాల తయారీలోనూ దీన్ని వాడుతారు. శతావరి కూడా బంగాళాదుంపలు, ముల్లంగి, క్యారెట్‌లాగానే భూగర్భంలో దుంపలను కలిగి ఉంటుంది. ఈ దుంపలు తీపి, చేదు రుచిని కలిగి ఉంటాయి. ఈ దుంపల్లో స్టెరాయిడల్ గ్లైకోసైడ్, పాలిసైక్లిక్ ఆల్కలాయిడ్, అస్పరగమైన్-ఎ, డై హైడ్రోఫెనామ్ త్రీన్ రెసిమొసోల్ తదితర రసాయనాలు ఉంటాయి. అందువల్ల మనకు వచ్చే వ్యాధులను శతావరితో తగ్గించుకోవచ్చు.
ఇక శతావరితో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. శతావరి చూర్ణాన్ని రోజూ నీటిలో కలిపి తీసుకోవాలి. ఒక టీస్పూన్ శతావరిని ఒక చిన్న టీ గ్లాస్ నీటిలో కలిపి తాగాలి. దీంతో జీర్ణవ్యవస్థలో ఉండే అల్సర్లు తగ్గుతాయి. అలాగే గ్యాస్ సమస్య కూడా ఉండదు. దీర్ఘకాలిక జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఈ చూర్ణం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ వ్యాధుల నుంచి బయట పడవచ్చు. ఇక శతావరి చెట్టు వేరును సేకరించి దాన్ని గంధంలాగా అరగదీసి కీళ్ల నొప్పులు, నరాల బలహీనత ఉన్న ప్రదేశంలో లేపనంగా రాయాలి. దీని వల్ల ఉపశమనం మాత్రమే కాకుండా ఆయా భాగాలు దృఢంగా కూడా మారుతాయి.
కిడ్నీ వ్యాధులు ఉన్నవారు శతావరి చూర్ణాన్ని రాత్రి నిద్రకు ముందు కాస్త కండ చక్కెరతో కలిపి తీసుకోవడం వల్ల మూత్ర సంబంధిత సమస్యలు అన్నీ తగ్గుతాయి. అలాగే ఈ విధంగా చేయడం వల్ల కంటి వ్యాధులు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా కంటి చూపు మెరుగు పడుతుంది. శతావరి చూర్ణాన్ని రోజూ వాడితే జీర్ణ శక్తి పెరుగుతుంది. అసలు ఆకలి లేని వారికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది. శతావరి దుంపల్లో అనేక పోషకాలు ఉంటాయి. అందువల్ల పోషకాహార లోపం ఉన్నవారు వాటిని తినవచ్చు. దీంతో పోషకాల లోపం తగ్గుతుంది. అయితే ఈ దుంపలను ఎండబెట్టి దంచి జల్లించి చూర్ణం తయారు చేసి ఒక టీస్పూన్ మోతాదులో తిని తరువాత ఒక గ్లాస్ పాలను తాగాలి. దీంతో శరీరం పుష్టిగా, దృఢంగా మారుతుంది. బలహీనతలు పోతాయి.
స్త్రీలకు సంబంధించిన రుతు సమస్యలు, గర్భాశయ సమస్యలు ఉన్నవారు శతావరి చూర్ణాన్ని తీసుకోవాలి. ప్రతి రోజూ శతావరి చూర్ణాన్ని ఏదో ఒక విధంగా తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. అలాగే రాత్రి పూట ఈ చూర్ణాన్ని తింటే మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. దీంతో మనస్సు ప్రశాంతంగా మారుతుంది. నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. అయితే శతావరి మనకు చూర్ణం, గుళికలు (ట్యాబ్లెట్స్), లేహ్యం వంటి రూపాల్లోనూ లభిస్తుంది. వీటిని వైద్యుల సలహా మేరకు వాడుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. ఇలా శతావరి మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. కనుక దీన్ని అసలు మరిచిపోకూడదు.