Tulsi Plant : మనం నిత్యం పూజించే మొక్కల్లో తులసి మొక్క కూడా ఒకటి. హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కకు ఎంతో విశిష్టత ఉంది. తులసి మొక్కను సాక్షాత్తూ లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తారు. ఈ మొక్క విశిష్టతను గర్తించిన మన పూర్వీకులు ఈ మొక్కను మన పెరట్లో భాగం చేశారు. తులసి మొక్కను కేవలం పూజించడానికి మాత్రమే కాకుండా మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో కూడా ఉపయోగించవచ్చు. తులసి మొక్కను మన ఇంట్లో ఎందుకు పెంచాలి.. తులసి మొక్క వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఏమిటి.. చనిపోయినప్పుడు తులసి తీర్థాన్ని ఎందుకు పోస్తారు.. వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తులసి చెట్టులో ప్రతిభాగం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. కచ్చితంగా ఇంట్లో పెంచుకోవాల్సిన కొన్ని రకాల చెట్లలో తులసి చెట్టు ఒకటి. ఈ మొక్క 22 గంటల పాటు ఆక్సిజన్ ను విడుదల చేస్తుందని పరిశోధకులు తెలియజేస్తున్నారు. ఈ ప్రత్యేకత ఏ ఇతర మొక్కలకు ఉండదు. తులసిని స్మరిస్తే చాలు.. సకల పాపాలు పోతాయని, తులసి మాలను ముట్టుకుంటే చాలు సకల రోగాలు పోతాయని పెద్దలు చెబుతుంటారు. తులసి చెట్టులో కూడా రామ తులసి, కృష్ణ తులసి అనే రకాలు ఉంటాయి. రామ తులసిని పూజించడం వల్ల పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుందని, కృష్ణ తులసిని పూజించడం వల్ల ఇంట్లో సిరిసంపదలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది.
తులసి చెట్టు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. తులసి ఆకులను తరచూ తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఆకుల రసంలో తేనెను కలిపి తీసుకోవడం వల్ల దగ్గు, కఫం, జలుబు వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. రాత్రి పడుకునే ముందు నీటిలో తులసి ఆకులను వేసి ఉంచాలి. ఉదయాన్నే ఈ నీటిని తాగడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. శరీరంలోని మలినాలు కూడా తొలగిపోతాయి. అజీర్తితో బాధపడే వారు తులసి ఆకుల రసంలో అల్లం రసాన్ని కలుపుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
చర్మ వ్యాధులతో బాధపడే వారు తులసి ఆకుల రసాన్ని చర్మానికి రాసుకుని అరగంట తరువాత స్నానం చేయడం వల్ల చర్మ సమస్యలు దూరం అవుతాయి. అలాగే చనిపోయి వారి గొంతులో తులసి తీర్థాన్ని పోయడం వల్ల వారు మరలా జన్మిస్తారని, అలాగే తీర్థం లోపలికి వెళ్లి శరీరం పాడవకుండా ఉంటుందన్న భావనతో తులసి జలాన్ని నోట్లో పోస్తారట. ఇక తులసి మొక్క సాక్షాత్తూ లక్ష్మీ దేవి స్వరూపం కనుక దీన్ని ఇంట్లో పెంచుకుంటే ఆర్థిక సమస్యలు ఉండవని, డబ్బుకు లోటు ఉండదని చెబుతున్నారు. ఎంతో విశిష్టత కలిగిన తులసి మొక్క మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.