Kichdi : ఎంతో రుచిక‌ర‌మైన కిచిడీ.. త‌యారీ ఇలా..!

Kichdi : మ‌నం అప్పుడ‌ప్పుడూ బియ్యం, పెస‌ర‌ప‌ప్పును క‌లిపి కిచిడీని త‌యారు చేస్తూ ఉంటాం. దీనిలో వివిధ ర‌కాల కూర‌గాయ ముక్క‌ల‌ను వేసి త‌యారు చేస్తాం. క‌నుక కిచిడీని తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది. రుచిగా, సుల‌భంగా కిచిడీని ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Kichdi making method recipe follow it
Kichdi

కిచిడీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బియ్యం – ఒక గ్లాస్, పెస‌ర ప‌ప్పు – అర గ్లాస్, నూనె – ఒక టేబుల్ స్పూన్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, జీడిప‌ప్పు – కొద్దిగా, దాల్చిన చెక్క ముక్క‌లు – 2 (చిన్న‌వి), యాల‌కులు – 2, సాజీరా – ఒక టీ స్పూన్, ల‌వంగాలు – 3, బిర్యానీ ఆకు – 1, త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చి మిర్చి – 3, క‌రివేపాకు – ఒక రెబ్బ‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, త‌రిగిన క్యారెట్ – 1, త‌రిగిన బంగాళాదుంప – 1, త‌రిగిన ట‌మాట – 1, ఉప్పు – త‌గినంత‌, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా, నీళ్లు – 3 గ్లాసులు.

కిచిడీ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో బియ్యాన్ని, పెస‌ర‌ప‌ప్పును తీసుకుని శుభ్రంగా క‌డగాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి అర గంట పాటు నాన‌బెట్టుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె, నెయ్యి వేయాలి. అవి వేడ‌య్యాక జీడిప‌ప్పును, మసాలా దినుసుల‌ను వేసి వేయించుకోవాలి. త‌రువాత ప‌చ్చి మిర్చిని, ఉల్లిపాయ ముక్క‌ల‌ను, క‌రివేపాకును వేసి వేయిచుకోవాలి. ఉల్లిపాయ‌ల ముక్క‌లు వేగిన త‌రువాత అల్లం వెల్లులి పేస్ట్ ను, ప‌సుపును వేసి క‌లిపి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి.

త‌రువాత క్యారెట్ ముక్క‌ల‌ను, బంగాళాదుంప ముక్క‌ల‌ను వేసి క‌లిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌ల‌ను వేసి మూత పెట్టి అవి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత ఉప్పును, ధ‌నియాల పొడిని వేసి క‌లిపి ఒక నిమిషం పాటు వేయించాలి. త‌రువాత కొత్తిమీర‌ను, పుదీనాను వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు ముందుగా నాన‌బెట్టుకున్న బియ్యాన్ని, పెస‌ర‌ప‌ప్పును వేసి ఒక నిమిషం పాటు క‌లుపుతూ వేయించాలి. త‌రువాత నీళ్ల‌ను పోసి క‌లిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు మ‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి. త‌రువాత మూత తీసి మ‌రోసారి క‌లిపాలి.

ఇప్పుడు మ‌ర‌లా మూత పెట్టి 10 నుండి 15 నిమిషాల పాటు చిన్న మంట‌పై ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కిచిడీ త‌యార‌వుతుంది. ఈ కిచిడీ త‌యారీలో ఇత‌ర కూర‌గాయ ముక్క‌ల‌ను కూడా వేసుకోవ‌చ్చు. ఈ విధంగా కిచిడీని త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచితోపాటు ఆరోగ్యం కూడా మీ సొంత‌మ‌వుతుంది.

D

Recent Posts