Uttareni Plant Benefits : ప్రకృతి ప్రసాదించిన ఔషధ మొక్కలల్లో ఉత్తరేణి మొక్క ఒకటి. ఈ మొక్క గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. పొలాల గట్ల మీద, బీడు భూముల్లో, చేను కంచెల వెంబడి, రోడ్లకు ఇరు పక్కల ఈ మొక్క విరివిరిగా పెరుగుతుంది. ఉత్తరేణి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దీనిలో కూడా తెలుపు రంగు ఉత్తరేణి, ఎరుపు రంగు ఉత్తరేణి అనే రెండు రకాలు ఉంటాయి. ఉత్తరేణి గింజలను సేకరించి నీడలో ఆరబెట్టి మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత ఈ పొడిని వస్త్రంలో వేసి జల్లించాలి. ఇలా జల్లించగా వచ్చిన పొడిని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని రోజూ ఉదయం చిటికెడు మోతాదులో ముక్కులోకి పీలుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఎంతటి కఠినమైన మూర్ఛ రోగం కూడా తగ్గిపోతుంది.
ఉత్తరేణి ఆకుల రసాన్ని కడుపు నొప్పి, అజీర్తి, మొలలు, గడ్డలకు, చర్మం పై వచ్చే పొంగుకు ఔషధంగా ఉపయోగించవచ్చు. ఉత్తరేణి మొక్క వేరుతో దంతాలను శుభ్రం చేసుకోవచ్చు. ఈ విధంగా దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంతాలు ఆరోగ్యంగా, ధృడంగా ఉంటాయి. దంతాల సమస్యలు రాకుండా ఉంటాయి. గాయాలు తగిలినప్పుడు ఉత్తరేణి మొక్క ఆకుల రసాన్ని రాయడం వల్ల గాయాల నుండి రక్తం కారడం ఆగుతుంది. అలాగే గాయాలు కూడా త్వరగా మానుతాయి. కందిరీగలు, తేనెటీగలు, తేళ్లు కుట్టిన చోట ఈ మొక్క ఆకులను ముద్దగా చేసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల విష ప్రభావం తగ్గి నొప్పి, మంట తగ్గుతాయి. చర్మ సంబంధిత సమస్యలను నయం చేసే గుణం కూడా ఈ ఉత్తరేణి మొక్కకు ఉంది.
ఈ మొక్కను కాల్చగా వచ్చిన బూడిదకు ఆముదాన్ని కలిపి పేస్ట్ గా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు ఉన్న చోట చర్మంపై రాయాలి. ఇలా చేయడం వల్ల ఆయా చర్మ సమస్యలు తగ్గు ముఖం పడతాయి. అలాగే ఈ బూడిదను తేనెలో కలిపి తీసుకోవడం వల్ల దగ్గు, ఉబ్బసం, కఫం వంటి శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఉత్తరేణి మొక్క వేరును చూర్ణం గా చేయాలి. తరువాత అందులో మిరియాల పొడి కలిపి చిన్న చిన్న మాత్రలుగా చేసుకోవాలి. ఈ మాత్రలను రోజుకు రెండు పూటలా తీసుకుంటూ ఉండడం వల్ల చర్మ రుగ్మతలు నశిస్తాయి. అలాగే ఎంతటి బాణ పొట్టనైనా తగ్గించే గుణం ఉత్తరేణికి ఉంది.
ఉత్తరేణి సమూల రసానికి అంతే మోతాదులో నువ్వుల కలిపి నూనె మిగిలే వరకు మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను రోజూ పొట్ట మీద రాస్తూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉండడం వల్ల పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. ఈ విధంగా ఉత్తరేణి మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చని ఆయేర్వేద నిపుణులు చెబుతున్నారు.