Hotel Style Puri Curry Recipe : పూరీల‌లోకి రొటీన్‌గా కాకుండా.. వెరైటీగా ఇలా చేయండి.. హోట‌ల్ స్టైల్‌లో రుచి వ‌స్తుంది..

Hotel Style Puri Curry Recipe : మ‌నం అప్పుడ‌ప్పుడూ ఉద‌యం పూట పూరీల‌ను త‌యారు చేసుకుని అల్పాహారంగా తీసుకుంటూ ఉంటాం. పూరీల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ పూరీల‌ను తిన‌డానికి మ‌నం పూరీ కూర‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పూరీ కూర రుచిగా ఉంటేనే పూరీలు తిన‌డానికి వీలుగా ఉంటాయి. ఈ పూరీ కూర‌ను హోట‌ల్స్ లో చేసే విధంగా రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

హోట‌ల్ స్టైల్ పూరీ కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన బంగాళాదుంప‌లు – 2, స‌న్న‌గా పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 3, ప‌చ్చి బ‌ఠాణీ – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన క్యారెట్ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, అల్లం త‌రుగు – అర టేబుల్ స్పూన్, శ‌న‌గ‌ప‌ప్పు – అర టీ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, జీల‌క‌ర్ర – పావు టీ స్పూన్, మైదా పిండి – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నూనె – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, కరివేపాకు – ఒక రెబ్బ‌.

Hotel Style Puri Curry Recipe in telugu very easy method
Hotel Style Puri Curry Recipe

హోట‌ల్ స్టైల్ పూరీ కూర త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన త‌రువాత శ‌న‌గ‌ప‌ప్పు, ఆవాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత అల్లం ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, క్యారెట్ ముక్క‌లు, ప‌చ్చి బ‌ఠాణీలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత ప‌సుపు, ఉడికించిన బంగాళాదుంప ముక్క‌లు, ఉప్పు వేసి 3 నిమిషాల పాటు క‌లుపుతూ వేయించాలి. త‌రువాత ఒక గ్లాస్ నీటిని పోసి మూత పెట్టి ప‌ది నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత ఒక గిన్నెలో మైదా పిండిని తీసుకుని అందులో నీటిని పోసి ఉండ‌లు లేకుండా ప‌లుచ‌గా క‌లుపుకోవాలి. దీనిని పూరీ కూర‌లో వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో నిమిషం పాటు ఉడికించి కొత్తిమీరను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే హోట‌ల్ స్టైల్ పూరీ క‌ర్రీ త‌యారవుతుంది. వేడి వేడి పూరీల‌తో ఈ కూర‌ను క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

D

Recent Posts