Peanuts : వేరుశెనగలను సహజంగానే చాలా మంది రోజూ ఉపయోగిస్తుంటారు. వీటితో ఉదయం చేసే ఇడ్లీ, దోశ వంటి బ్రేక్ ఫాస్ట్‌లకు చట్నీలను తయారు చేస్తుంటారు. ఇక పల్లీలను స్వీట్ల తయారీలోనూ ఉపయోగిస్తారు. పల్లీలు అంటే సహజంగానే చాలా మందికి ఇష్టంగానే ఉంటుంది. అయితే వీటిని తింటే బరువు పెరుగుతారా ? అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. మరి ఇందుకు నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
పల్లీల్లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. అందుకు కారణం వాటిల్లో ఉండే కొవ్వు, ప్రోటీన్ పదార్థాలే అని చెప్పవచ్చు. అందువల్ల పల్లీలను ఎక్కువగా తింటే కచ్చితంగా బరువు పెరుగుతారు. ఒక గ్లాస్ పాలకన్నా, ఒక కోడిగుడ్డు కన్నా అధిక మోతాదులో క్యాలరీలు మనకు పల్లీల ద్వారా లభిస్తాయి. మాంసం కన్నా ఎక్కువ ప్రోటీన్లు మనకు పల్లీల ద్వారా లభిస్తాయి.
100 గ్రాముల పల్లీలను తింటే మనకు 580 క్యాలరీల శక్తి లభిస్తుంది. అంటే.. వీటిని అధికంగా తింటే కచ్చితంగా బరువు పెరుగుతారని చెప్పవచ్చు. కానీ వీటిని రోజుకు 10 నుంచి 15 గ్రాముల మోతాదులో తింటే బరువు పెరగరు. బరువు తగ్గుతారు. అవును.. పల్లీల్లో ఉండే అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు మన శరీరంలోని కొవ్వును కరిగించేందుకు సహాయ పడతాయి. కనుక పల్లీలను రోజుకు 10 నుంచి 15 గ్రాముల మోతాదులో తినవచ్చు. దీంతో బరువు పెరగరు, బరువు తగ్గుతారు.
పల్లీల్లో పాలిఫినాల్స్ అనబడే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ ఏజింగ్ పదార్థాలుగా పనిచేస్తాయి. అంటే పల్లీలను తింటే వృద్ధాప్య ఛాయలు త్వరగా రావన్నమాట. దీంతో ముఖం, చర్మంపై ముడతలు తగ్గిపోతాయి. యవ్వనంగా కనిపిస్తారు. కాబట్టి పల్లీలను రోజూ తక్కువ మోతాదులో తింటే ప్రయోజనాలను పొందవచ్చన్నమాట.