మనలో చాలా మందికి గ్యాస్ సమస్య వస్తుంటుంది. గ్యాస్ సమస్య వస్తే సహజంగానే చాలా మంది మెడికల్ షాపుకు వెళ్లి ఏదో ఒక మెడిసిన్ కొని తెచ్చి వేసుకుంటారు. దీంతో సమస్య అప్పటికప్పుడు తగ్గుతుంది. కానీ మళ్లీ ఆ సమస్యను కొని తెచ్చుకుంటారు. ఇలా ఈ సైకిల్ రిపీట్ అవుతుంది. అయితే గ్యాస్ సమస్య ఎందుకు వస్తుందో తెలుసుకుని దానికి పరిష్కారం చేస్తే ఆ సమస్య రాకుండా జాగ్రత్త పడవచ్చు.
మనం వేళకు భోజనం చేయకపోతే గ్యాస్ వస్తుందా ? అంటే.. అవును.. కచ్చితంగా గ్యాస్ వస్తుంది. సాధారణంగా మనం తినే ఆహారం కొన్ని గంటల్లో జీర్ణమవుతుంది. దీంతో జీర్ణాశయం ఖాళీ అవుతుంది. తరువాత శక్తి తగ్గుతుంది. ఈ క్రమంలో మనకు ఆకలి అవుతుంది. ఫలితంగా మనం ఆహారం తింటాము కావచ్చు అని జీర్ణాశయంలో జీర్ణ రసాలు ఉత్పత్తి అవుతాయి. కానీ మనం ఏమీ తినకపోతే ఆ రసాల వల్ల జీర్ణాశయంలో గ్యాస్ తయారవుతుంది. ఇక మనం ఆ తరువాత ఆహారం తిని కూడా ప్రయోజనం ఉండదు. కనుక వేళకు భోజనం చేయాల్సి ఉంటుంది. దీంతో గ్యాస్ సమస్య రాకుండా చూసుకోవచ్చు.
ఇక గ్యాస్ వచ్చేందుకు పలు ఇతర కారణాలు కూడా ఉంటాయి. ఆహారాన్ని వేగంగా తిన్నా, అధికంగా ఆహారం తీసుకున్నా, పిండి పదార్థాలు, కొవ్వులు, ప్రోటీన్లు.. వీటిని ఎక్కువగా తిన్నా.. గ్యాస్ సమస్య వస్తుంది. కొందరికి అజీర్ణం కారణంగా గ్యాస్ వస్తుంది. కొందరు ఉదయాన్నే సరిగ్గా మల విసర్జన చేయకపోతే గ్యాస్ వస్తుంది. కొందరికి రోజూ వాడే మెడిసిన్ల వల్ల గ్యాస్ వస్తుంది.
ఇలా గ్యాస్ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అందువల్ల అన్నికారణాలను విశ్లేషించి గ్యాస్ ఎందుకు వస్తుందో ముందుగా తెలుసుకోవాలి. దానికి తగినట్లుగా పరిష్కారం చేయాలి. దీంతో గ్యాస్ సమస్య నుంచి బయట పడవచ్చు.