Pani Puri : చిరుతిండ్లను తినేందుకు సహజంగానే చాలా మంది ఆసక్తిని చూపిస్తుంటారు. ఈ క్రమంలో ఎవరైనా సరే తమ అభిరుచులకు అనుగుణంగా భిన్న రకాల చిరుతిళ్లను తింటుంటారు. వాటిల్లో అనేక వెరైటీలు ఉంటాయి. అయితే అధిక శాతం మంది తినే చిరుతిళ్లలో పానీపూరీ ఒకటి. దీన్ని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు.
పానీపూరీలను సహజంగానే చాలా మంది బయట తింటుంటారు. కొద్దిగా శ్రమించాలే కానీ వీటిని ఇంట్లోనూ తయారు చేసుకోవచ్చు. అయితే పానీపూరీ తినడం ఆరోగ్యానికి మంచిదేనా ? దీని వల్ల ఏమైనా చెడు ప్రభావాలు కలుగుతాయా ? ఇందుకు వైద్యులు ఏమంటున్నారు ? అంటే..
అన్ని చిరుతిళ్లలాగే పానీ పూరీ ఒకటి. పానీ పూరీలను నూనెలో వేయిస్తారు. ఆ పూరీల తయారీకి మైదా పిండిని వాడుతారు. వీటిని వేయించేందుకు వాడే నూనెతోపాటు తయారు చేసేందుకు వాడే మైదా పిండి.. రెండూ అనారోగ్యకరమైనవే. అందువల్ల పానీపూరీలను అనారోగ్యకరమైన ఆహారం అని చెప్పవచ్చు.
పానీపూరీలను తరచూ అధికంగా తినడం వల్ల శరీరంలో కొవ్వు అధికంగా చేరుతుంది. ఇది అధిక బరువుకు కారణమవుతుంది. కనుక పానీపూరీలను తరచూ తినే అలవాటు ఉంటే దాన్ని మానుకోవడం మంచిది. ఎప్పుడో ఒకసారి అయితే ఫర్వాలేదు, కానీ వారం వారం తినేవారు లేదా రోజూ తినేవారు.. వాటిని తినకపోవడమే మంచిది.
ఇక గుండె జబ్బులు ఉన్నవారు, అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు, మధుమేహం ఉన్నవారు పానీపూరీలను తినరాదు. తింటే ఆయా సమస్యలు మరింత ఎక్కువయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక వారు పానీపూరీలను తినకూడదు.