Digestion : సాధారణంగా మనం రోజూ శాకాహారాలనే తింటుంటాం. వారానికి ఒకసారి లేదా శుభకార్యాలు.. ఇతర సందర్భాల్లోనే మాంసాహారం తింటుంటాం. చికెన్, మటన్, చేపలు.. తదితర మాంసాహారాలను అప్పుడప్పుడు తింటుంటాము. అయితే శాకాహారాలు త్వరగానే జీర్ణం అవుతాయి. ఇబ్బంది ఉండదు. కానీ మాంసాహారం జీర్ణం అయ్యేందుకు కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. ఈ క్రమంలో కొందరికి మాంసాహారం కొన్ని సార్లు జీర్ణం కాదు. దీని వల్ల ఇబ్బందులు వస్తాయి. అజీర్ణం, గ్యాస్, కడుపులో మంట వంటి సమస్యలు వస్తాయి. అయితే ఇలా జరగకుండా ఉండేందుకు.. మాంసాహారం తిన్న వెంటనే త్వరగా అది జీర్ణం కావాలంటే.. ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మాంసాహారం త్వరగా జీర్ణం అయ్యేందుకు అల్లం రసం ఎంతగానో దోహదపడుతుంది. అల్లం రసం సేవించడం వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. మాంసాహారం తిన్న తరువాత ఒక గంట విరామం ఇచ్చి ఆ తరువాత ఒక టీస్పూన్ అల్లం రసం సేవించాలి. అందులో కొద్దిగా నిమ్మరసం, తేనెలను కూడా కలిపి తీసుకోవచ్చు. దీంతో మాంసాహారం త్వరగా జీర్ణమవుతుంది. ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
2. మాంసాహారాన్ని త్వరగా జీర్ణం చేసేందుకు పుదీనా రసం కూడా బాగానే పనిచేస్తుంది. భోజనం చేశాక 4-5 పుదీనా ఆకులను నోట్లో వేసుకుని నమిలి మింగాలి. లేదా ఒక గ్లాస్ మజ్జిగలో కాస్తంత పుదీనా రసం కలిపి తాగాలి. దీంతో ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.
3. ఇక తిన్న వెంటనే గుప్పెడు సోంపు గింజలను నమిలినా ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. కానీ సోంపు గింజలను భోజనం చేసినప్పుడల్లా నమిలితేనే ప్రయోజనం కలుగుతుంది. ఇది కూడా మాంసాహారాన్ని త్వరగా జీర్ణం చేయగలదు.
4. పైనాపిల్ ముక్కలు లేదా జ్యూస్‌ను తాగినా మాంసాహారం త్వరగా జీర్ణమవుతుంది. భోజనం చేశాక 30 నిమిషాల విరామం అనంతరం ఒక కప్పు పైనాపిల్ జ్యూస్‌ను చక్కెర లేకుండా తాగాలి. లేదా 4-5 పైనాపిల్ ముక్కలను తినవచ్చు. దీంతో ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
5. జామకాయలు, నారింజ, ద్రాక్ష వంటి పండ్లను తింటున్నా మాంసాహారం త్వరగా జీర్ణమవుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు. అలాగే భోజనం అనంతరం ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని నమిలి మింగాలి. దీంతో కూడా ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.