Chicken Tangdi Kabab : ఓవెన్ లేక‌పోయినా ఇంట్లోనే అదిరిపోయే రుచితో చికెన్ తంగ్డీ క‌బాబ్స్‌ను ఇలా త‌యారు చేసుకోండి..!

Chicken Tangdi Kabab : చికెన్ అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. దీంతో అనేక ర‌కాల వెరైటీల‌ను త‌యారు చేసుకుని తింటుంటారు. అయితే చికెన్‌తో వేడి వేడి తంగ్డీ క‌బాబ్స్ చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. కానీ ఇంట్లో వీటికి ఓవెన్ ఉండాలి. అయితే ఓవెన్ లేకపోయినా ఇంట్లోనే ఎంతో రుచిగా, క్రిస్పీగా చికెన్ తంగ్డీ క‌బాబ్స్‌, పుదీనా చ‌ట్నీల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. వాటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల‌ను, త‌యారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Chicken Tangdi Kabab easy prepare without oven recipe
Chicken Tangdi Kabab

చికెన్ తంగ్డీ క‌బాబ్స్‌ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ – 4 లెగ్ పీసెస్‌, పెరుగు – ఒక క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, కారం – 2 టీ స్పూన్స్‌, త‌రిగిన ప‌చ్చి మిర్చి – 2 టీ స్పూన్స్‌, నిమ్మ ర‌సం – 2 టీ స్పూన్స్‌, ధ‌నియాల పొడి – 2 టీ స్పూన్స్‌, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్‌, చాట్ మ‌సాలా – ఒక టీ స్పూన్‌, బ్లాక్ సాల్ట్ – పావు టీ స్పూన్‌, మిరియాల పొడి – పావు టీ స్పూన్‌, యాల‌కుల పొడి – కొద్దిగా, ప‌సుపు – పావు టీ స్పూన్‌, క‌సూరి మెంతి – పావు టీ స్పూన్‌, చికెన్ తందూరి మ‌సాలా – 2 టీ స్పూన్స్‌, నూనె – 2 టీ స్పూన్స్‌, బ‌ట‌ర్ – కొద్దిగా.

చికెన్ తంగ్డీ క‌బాబ్స్‌ త‌యారు చేసుకునే విధానం..

మొద‌ట‌గా పెరుగులో నీళ్లు లేకుండా వ‌డ‌క‌ట్టాలి. ఇప్పుడు ఈ పెరుగులో చికెన్‌, బ‌ట‌ర్ త‌ప్ప మిగిలిన ప‌దార్థాలు అన్నీ వేసి బాగా క‌లుపుకోవాలి. చికెన్ లెగ్ పీసెస్ తీసుకుని వాటికి ముందుగా క‌లిపి పెట్టిన పెరుగు మిశ్ర‌మాన్ని బాగా ప‌ట్టించి, ఫ్రిజ్‌లో 5-6 గంట‌ల పాటు ఉంచాలి. త‌రువాత ఒక మంద‌పాటి పాన్ ను తీసుకుని అందులో బ‌ట‌ర్ వేసి కాగాక చికెన్ పీసెస్ వేసి అటు ఇటు క‌దుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పుల్కాలు కాల్చే పెనం పెట్టి చికెన్ పీసెస్ ను దానిపై ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చికెన్ తంగ్డీ క‌బాబ్స్ కు స్మోక్ ఫ్లేవ‌ర్ వ‌స్తుంది. దీంతో ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే చికెన్ తంగ్డీ క‌బాబ్స్ రెడీ అవుతాయి. ఈ తంగ్డీ క‌బాబ్స్ ను పుదీనా చ‌ట్నీతో తింటే ఎంతో రుచిగా ఉంటాయి.

ఇప్పుడు పుదీనా చ‌ట్నీకి కావ‌ల్సిన ప‌దార్థాలు, త‌యారు చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం.

పుదీనా చ‌ట్నీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పెరుగు – ఒక క‌ప్పు, పుదీనా – ఒక క‌ప్పు, కొత్తిమీర – అర క‌ప్పు, అల్లం ముక్క‌లు – ఒక టీ స్పూన్‌, ప‌చ్చి మిర‌ప‌కాయ‌లు – రెండు, జీడి పప్పు – 10 గ్రా., ఉప్పు – త‌గినంత‌, చాట్ మ‌సాలా – ఒక టీ స్పూన్‌, నిమ్మ ర‌సం – ఒక టీ స్పూన్‌.

పుదీనా చ‌ట్నీ త‌యారుచేసే విధానం..

ముందుగా పెరుగును నీళ్లు వేయ‌కుండా బాగా చిల‌కాలి. ఇప్పుడు ఒక జార్ లో పెరుగు త‌ప్ప మిగిలిన ప‌దార్థాలు అన్నింటినీ వేసి మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్ర‌మంలో కొద్ది కొద్దిగా పెరుగును పేసుకుంటూ బాగా క‌లుపుకోవాలి. దీంతో పుదీనా చ‌ట్నీ త‌యార‌వుతుంది. ముందుగా త‌యారు చేసిపెట్టిన చికెన్ తంగ్డీ క‌బాబ్స్‌ను ఈ పుదీనా చ‌ట్నీలో ముంచి తింటుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. నోట్లో నీళ్లూర‌డం ఖాయం. ఇలా ఓవెన్ లేక‌పోయినా.. చికెన్ తంగ్డీ క‌బాబ్స్‌ను ఇంట్లోనే ఎంతో రుచిక‌రంగా త‌యారు చేసుకుని వాటిని ఆస్వాదించ‌వ‌చ్చు.

Share
D

Recent Posts