Soul : మనిషి మరణించిన తరువాత ఆత్మ ఏమవుతుంది.. అసలు పునర్జన్మ అనేది ఉందా.. అనే సందేహాలు మనలో చాలా మందికి కలిగే ఉంటాయి. అంతుచిక్కని ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పరిశోధకులు ఇప్పటికీ పరిశధనలు చేస్తూనే ఉన్నారు. వారి సంగతి పక్కకు పెడితే మన పురాతన గ్రంథాల్లో ఆత్మ ప్రయాణం, పునర్జన్మ గురించి ఎంతో వివరంగా చెప్పబడింది. మనిషి మరణించిన తరువాత ఆత్మ ఎన్ని రోజులకు యమపురి చేరుకుంటుంది. ఆత్మహత్య చేసుకున్న వారి ఆత్మలు ఎక్కడ ఉంటాయి. మనిషి మరణించిన తరువాత ఆత్మ ఎంత కాలానికి మరో శరీరంలోకి ప్రవేశిస్తుంది.. వంటి తదితర ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పుట్టిన వారు మరణించక తప్పదు. మరణించిన వారు తిరిగి జన్మించక తప్పదు. ఇదే భగవద్గీత మనకు చెప్పిన సత్యం. మరణం కేవలం శరీరానికి మాత్రమే, ఆత్మకు కాదు. ఎల్లప్పుడూ మన శరీరం ఆత్మను గట్టిగా అంటిపెట్టుకుని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది. వయసు పెరగడం, ఆత్మహత్య చేసుకోవడం వంటి తదితర కారణాల వల్ల ఆత్మపైన శరీరానికి పట్టుకోల్పోతుంది. ఇలా మన శరీరం ఆత్మను పట్టుకునే సామర్థ్యం లేనప్పుడు బొటన వేలు పరిమాణంలో ఉండే ఆత్మ మూలాధార చక్రం ద్వారా సూక్ష్మ రూపంలో శరీరం నుండి బయటకు వస్తుంది. దీనినే మరణం సంభవించడం అంటారు. ఆత్మ శరీరం నుండి బయటకు వచ్చే సమయంలో శరీరం చుట్టూ ఒక శక్తివంతమైన కాంతివలయం ఏర్పడుతుంది. ఈ కాంతి వలయం నుండి ఎర్రటి నేత్రాలతో పొడవాటి జుట్టుతో భయంకరంగా ఉన్న ఇద్దరు యమభటులు బయటకు వచ్చి వారి ఆయుధంతో ఆత్మను శరీరం నుండి బయటకు లాగుతారు. ఈ సమయంలో ఆత్మ భౌతిక శరీరాన్ని వదిలి పెట్టలేక రాను రాలేనని పరిపరి విధాలుగా దుఖిస్తూ యమభటులను వేడుకుంటూ ఉంటుంది.
వారు అవి ఏమీ పట్టించుకోకుండా ఆత్మను శరీరం నుండి వేరు చేస్తారు. శరీరం నుండి బయటకు వచ్చాక కూడా శరీరం మీద వ్యామోహం తీరక మరలా లోపలికి ప్రవేశాంచాలని ఆత్మ చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అందుకే మరణించిన తరువాత శరీరంలో కొన్ని నిమిషాల పాటు కొద్దిపాటి కదలికలను మనం గమనించవచ్చు. ఇలా శరీరం నుండి వేరుపడిన ఆత్మ మరలా ఆ శరీరంలో ప్రవేశించడం అసాధ్యమని గ్రహించి ఇక చేసేదేమి లేక పార్థివ శరీరానికి 12 అడుగుల ఎత్తులో ఉండి తన దేహానికి అంతక్రియలు ముగిసే వరకు తన బంధువులను, స్నేహితులను చూస్తూ బాధపడుతూ ఉంటుంది. అంతక్రియలు కూడా పూర్తయిన తరువాత యమభటుల అనుమతితో ఏడు రోజుల పాటు ఉండి ఇప్పటి వరకు తిరిగిన ప్రదేశాలను కలిసిన మనుషులను సూక్ష్మ రూపంలో చుట్టి వస్తుంది. అలా తిరిగి వచ్చిన ఆత్మ ఇంక ఈ దేహంతో ఉన్న బంధాలను, బాంధవ్యాలను తెంచుకుని యమ భటులతో కలిసి ఆత్మల లోకానికి ప్రయాణం కొనసాగిస్తుంది.
ఈ ప్రయాణంలో ఇటీవల మరణించిన వారి ఆత్మలు కూడా తారసపడుతూ ఉంటాయి. మరణం తరువాత ఆత్మలు లోకానికి చేరుకోవడానికి 13 రోజుల సమయం పడుతుంది. ఈ సమయానికే మరణించిన వారి రక్తసంబంధీకులు మరణించిన వారికి శ్రాద్ధ కర్మలను శాస్త్రోక్తంగా నిర్వహించి పిండ ప్రదానం చేయగానే ఆ ఆత్మకు పితృలోకానికి వెళ్లడానికి అనుమతి లభిస్తుంది. ఒకవేళ అలా చేయకపోతే ఆ ఆత్మ అక్కడే ఉండి వెనక్కి ముందుకు కదల్లేక శ్రాద్ధకర్మలు చేసే వరకు ఎంతో క్షోభను అనుభవిస్తుంది. ఇదిలా ఉండగా అకాల మరణం పొందిన వారి ఆత్మ ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అకాల మరణం అంటే ఆయుష్షు తీరకుండానే మరణించడం అని అర్థమన్నమాట. అంటే ఒక వ్యక్తి ఆయుష్షు 75 సంవత్సరాలు అనుకుంటే అతను 25 సంవత్సరాలకే ఆత్మహత్య చేసుకోవడమో, యాక్సిడెంట్ వల్ల మరణిస్తే ఇంకా అతని ఆయుష్షు 50 సంవత్సరాలు మిగిలిపోతుంది.
ప్రతి వ్యక్తి పుట్టినప్పుడు గత జన్మలో చేసిన పాపపుణ్యాల తాలూకు కర్మ ఫలాన్ని ఈ జన్మలో కేటాయించబడిన ఆయుష్షు ప్రమాణంలో తప్పనిసరిగా అనుభవించాల్సి ఉంటుంది. అది పాపమైన కావచ్చు. పుణ్మమైనా కావచ్చు. అకాల మరణం సంభవించి ఆ వ్యక్తి 25 సంవత్సరాలకే మరణిస్తే మిగిలిన 50 సంవత్సరాల కర్మ ఫలం పూర్తవ్వకుండా అలా బాకీ ఉండి పోతుంది. దీంతో ఆత్మ ఆత్మల లోకానికి వెళ్లకుండా తన ఆయుష్షు తీరే వరకు కామలోకం అనే లోకంలో విహరిస్తూ ఉంటుంది. ఆయుష్షు తీరకుండా మరణించిన వారి ఆత్మ భౌతిక లోకాన్ని ఎప్పటిలాగా చూడగలదు. కానీ తనకు శరీరం లేకపోవడంతో సూక్ష్మ రూపంలో ఉండిపోతుంది.
ఇలా తన ఆయుష్షు ప్రమాణం తీరే వరకు తను బ్రతికి ఉండగా తిరిగిన ప్రదేశాలు, మనుషుల మధ్య తిరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి కోరికలు తీరకుండా మరణించిన ఆత్మ బలహీంగా ఉన్న శరీరాలను చూసుకుని దానిలోకి ప్రవేశించి తాను తీర్చుకోవాలనుకున్న కోరికలను తీర్చుకుంటుంది. ఆయుష్షు పూర్తవగానే సహజంగా మరణించిన వారి ఆత్మ ఎలాగైతే వెళుతుందో ఇలా అకాల మరణం పొందిన వారి ఆత్మ కూడా ముందుకు కదులుతుంది. ఆత్మల లోకం నుండి యమపురికి చేరే సమయంలో ఆత్మసౌమ్యము, శౌరి, నాగేంద్రభవనము మొదలైన 16 నగరాల నుండి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రయాణించి ప్రయాణించిన ఆత్మ 171వ రోజుకు యముడి సోదరుడైన విచిత్ర రాజు పరిపాలించే విచిత్ర భవనం అనే నగరానికి చేరుకుంటుంది. ఈ నగరానికి ఆనుకునే వైతరిణీ నది ఉంటుంది.
నరకంలోకి ప్రవేశించాలంటే ఈ నదిని దాటుకునే ప్రవేశించాలి. ఈ నదిలో నీటికి బదులుగా చీము, నెత్తురు సలసల మరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఆత్మకు తాను ఈ జన్మలో చేసిన పాపాల్ని అనుభవించడానికి వీలుగా ఒక యాతన శరీరాన్ని ఇస్తారు. దీనికి స్పర్మ, వాసన ఉంటాయి. దీనిని అగ్నిలో వేసినా నొప్పి తెలుస్తుంది. కానీ భస్మం కాదు. ఈ యాతన శరీరంలో జీవిని ప్రవేశపెట్టిన యమకింకరులు దక్షిణ ద్వారం గుండా యమపురికి చేరుస్తారు. జీవి మరణించినప్పటి నుండి ఇక్కడికి చేరుకోవడానికి సరిగ్గా 361 రోజుల సమయం పడుతుందట. మరణించిన తరువాత 361 వ రోజు నుండి 3 రోజుల పాటు సంవత్సరికాన్ని నిర్వహిస్తారు. దీంతో ఆ జీవికి భూమిపైన ఉన్న బంధాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది.
ఇక్కడ జీవి చేసిన పాపాలకు తగిన శిక్షలు విధిస్తారు. ఈ శిక్షాకాలం 5 నుండి 40 సంవత్సరాల వరకు ఉంటుందట. గత జన్మలో చేసిన పాపాలకు శిక్ష అనుభవించిన తరువాత ఆత్మ యాతన శరీరం నుండి బయటకు వచ్చి మరొక దేహంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక్కడే ఆ ఆత్మకు తన తల్లిదండ్రులను నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఎవరి గర్భంలోకి వెళ్లాలో ముందే నిర్ణయించుకున్న ఆత్మ పురుషుని ద్వారా స్త్రీలలోకి ప్రవేశించి పిండంలా మారి 9 నెలల పాటు చీకటి కుహరంలో బంధించబడి 9 నెలల తరువాత తిరిగి భూమిపైన అడుగు పెడుతుంది. మరు జన్మనెత్తిన శిశువుకు గత జన్మ జ్ఞాపకాలు 40 రోజుల నుండి 4 సంవత్సరాల పాటు ఉంటాయట. అందువల్లే పుట్టిన బిడ్డ అకారణంగా తనలో తానే నవ్వుకుంటూ ఏడుస్తూ ఉంటుందట. ఈ విధంగా ఆత్మల గురించి వివరించారు.