Guthi Vankaya Vepudu : వంకాయ.. మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో ఇది కూడా ఒకటి. ఇతర కూరగాయల లాగా దీనిలో కూడా మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వంకాయల్లో వివిధ రకాలు కూడా ఉంటాయి. వాటిలో గుత్తివంకాయ కూడా ఒకటి. గుత్తి వంకాయతో ఎటువంటి కూర చేసినా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ వంకాయలతో చాలా సులభంగా అదేవిధంగా చాలా తక్కువ సమయంలో అయిపోయేలా వేపుడును ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
గుత్తి వంకాయ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
గుత్తి వంకాయలు – పావు కేజీ, నూనె – 3 టేబుల్ స్పూన్స్, పెద్ద ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ – 1, పెద్ద ముక్కలుగా తరిగిన టమాట – 1 (పెద్దది), కొత్తిమీర – పావు కప్పు, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్లు, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా పొడి – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, నీళ్లు – అర కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
గుత్తి వంకాయ వేపుడు తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో ఉల్లిపాయ ముక్కలు, టమాట ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత వంకాయలను తొడిమ తీయకుండా నిలువుగా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇలా తరిగిన వంకాయలను ఉప్పు నీటిలో వేసి 5 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత వంకాయలను వేసి మూత పెట్టాలి. ఈ వంకాయలను మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించిన వంకాయలను తీసి పక్కకు పెట్టుకోవాలి.
తరువాత అదే కళాయిలో కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి కలుపుతూ 5 నుండి 10 నిమిషాల పాటు నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి. తరువాత నీటిని పోసి కలపాలి. ఆ తరువాత వేయించుకున్న వంకాయలను కూడా వేసి కలపాలి. తరువాత దీనిలో ఉండే నీరు అంతా పోయి ఉల్లిపాయ మిశ్రమం దగ్గర పడే వరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ వేపుడు తయారవుతుంది. ఈ వేపుడుని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసిన గుత్తివంకాయ వేపుడును వంకాయ అంటే ఇష్టంలేని వారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.